తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ ఎస్‌కు చెందిన సభ్యులు అందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అయితే.. సభకు వచ్చిన వారిని ఉద్దేశించే నని ఆయన తెలిపారు. ఆ సమయంలో సభలో కీలక నేతలు.. హరీష్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అనిల్, సుధీర్, ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్.. వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. వీరితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు.
సభలో స్పీకర్ నిర్ణయం వెలువరించే సమయంలో తమను సస్పెండ్ చేయడం అన్యాయం అంటూ.. హరీష్‌రావు విమర్శించారు. కాగా.. ఈ సమావేశాల మొత్తం వరకు కూడా వారిని సస్పెండ్ చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పీకర్‌కు విన్నవించారు. దీనికి సంబంధించి సభా నియమాల పప్రకారం.. ఆయన నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తక్షణమే ఆ నిర్ణయం తీసుకుంటూ. ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. తమను సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొంటూ.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా.. బీఆర్ ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.
మీరు దొరలు.. మీరు దగుల్బాజీలు!
ఈ సస్పెన్షన్ వ్యవహారం సాగుతున్న సమయంలో మంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ ఎస్ పాలనపై నిప్పు లు చెరిగారు. అదేసమయంలో దళితులు నిరసన తెలిపితే.. వారు నడిచిన దారులను పసుపు నీళ్లతో శుద్ధి చేశారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దొరలు కాబట్టే.. మీకు దళితులు అంటే లెక్కలేదని.. వారిని, వారి ఇంట్లో వారిని కూడా దూషిస్తారని మండిపడ్డారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాతృమూర్తి ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. ఆయనను ఆయన తల్లిని కూడా దూషించారని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో హరీష్‌రావు(మైక్ ఇవ్వలేదు) కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు దొరలు అని భట్టి అంటే.. మాటకు మాట అన్నట్టుగా.. మీరు దగుల్బాజీలు.. మీది దగుల్బాజీ పాలన అంటూ.. విరుచు కుపడ్డారు. ఎమ్మెల్యేలను అవమానించారని, కొట్టించారని ఎదురు దాడి చేశారు. తమను సస్పెండ్ చేసి.. ప్రజల సమస్యలపై చర్చలకు రాకుండా ఈ ప్రభుత్వం పారిపోతోందని దుయ్యబట్టారు. మొత్తంగా.. సుమారు 30 నిమిషాల పాటు.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం సాగింది.