తుని తీరు మారుతోంది.. వైసీపీ ప‌రిస్థితేంటి.. ?

admin
Published by Admin — September 23, 2026 in Politics, Andhra
News Image

తుని(Tuni) నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యురాలు యనమల దివ్య దూకుడు చూపిస్తున్నారు. దీంతో ఆమె పనితీరుపై నియోజకవర్గంలో సానుకూలమైన ప్రజా స్పందన కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఆమె, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె పనితీరు, ప్రజాక్షేత్రంలో యాక్టివిటీ వంటివి ప్ర‌భుత్వానికి మంచి పేరు తెస్తున్నాయ‌ని అంటున్నారు. ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దివ్య ప్రాధాన్యం ఇస్తున్నారు.  నియోజకవర్గంలో నిరంతరం 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకునేలా, అధికారుల సమన్వయంతో వాటిని వేగంగా పరిష్కరించేలా యనమల దివ్య(Yanamala Divya) చొరవ చూపుతున్నారు.  నిరంతరం ప్రజల్లో ఉండటం ఆమెకు క‌లిసి వ‌స్తోంది. నియోజకవర్గంలోని గ్రామాల్లో, వార్డుల్లో తరచూ పర్యటిస్తూ నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ఆమె అనుసరిస్తున్న శైలి పట్ల సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే నియోజకవర్గంలో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం మరియు స్థానిక ప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌, వైసీపీ(YCP) ప‌రిస్థితి భిన్నంగా ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన య‌న‌మ‌ల కృష్ణుడు.. కూట‌మి అధికారంలోకి  వ‌చ్చిన త‌ర్వాత‌.. కాడి ప‌డేశారు. త‌న‌కు వైసీపీకి సంబంధం లేద‌న్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా కేడ‌ర్ దిక్కులు చూసే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు.. కొంద‌రు వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌స్తామ‌న్నా.. ఇప్ప‌టికే ఉన్న కేడ‌ర్ తో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు..
ఎమ్మెల్యే దివ్య ప‌నితీరుకు సీఎం చంద్ర‌బాబు(CM Chandrababu) వ‌ద్ద మంచి మార్కులే ప‌డుతున్నాయి. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే విష‌యంలో నూటికి నూరు మార్కులు ప‌డ‌డం గ‌మ‌నార్హం. అలానే.. స‌మ‌న్వ‌యం విష‌యంలోనూ ఆమె ప‌నితీరు బాగుంద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి కుమార్తెగా అరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ పంథాను  అనుస‌రిస్తూ... త‌ల్లోనాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న దివ్య‌.. తునిలో శాస్వ‌తంగా వ‌రుస విజ‌యాలు సాధించి.. త‌న తండ్రి రికార్డును అధిగ‌మించాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags
Tuni Yanamala Divya TDP YSRCP Chandrababu Naidu Yanamala Krishnudu Tuni politics
Recent Comments
Leave a Comment

Related News