ఫ‌స్ట్ టైమ్ ఎంపీ: ట్రాక్ బాగున్నా.. ప‌ట్టించుకున్నోళ్లేరి.. !

admin
Published by Admin — September 23, 2026 in Politics, Andhra
News Image

ప్రస్తుతం అరకు లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీ తరపున డాక్టర్ గుమ్మ తనుజా రాణి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఆమె నియోజకవర్గ సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నారు. పార్లమెంటు రికార్డులు, తాజా రాజకీయ, సామాజిక పరిణామాల ప్రకారం ఆమె పనితీరు బాగుంద‌న్న టాక్ ఉంది. పార్లమెంట్‌లో క్రియాశీల స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియా ట్రాకర్ గణాంకాల ప్రకారం, ఆమె పార్లమెంట్‌లో ఇప్పటివరకు 100కు పైగా ప్రశ్నలు అడిగి నియోజకవర్గ, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టారు.

అదే స‌మ‌యంలో అంద‌రూ మ‌రిచిపోయిన ఏపీ(AP)కి `ప్రత్యేక హోదా` కల్పించాలని పార్లమెంట్‌లో గళమెత్తారు. అంతే కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇక‌, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో గిరిజన ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలపై ఆమె నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల అనారోగ్య సమస్యలు, మరణాలపై తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో RO ప్లాంట్లు ఏర్పాటు చేసి సురక్షితమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేయ‌డం ప‌నితీరుకు అద్దం ప‌డుతోంది.

మ‌రోవైపు.. ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా త‌నూజ‌కు క‌లిసి వ‌స్తోంది. స్థానిక గిరిజన ప్రజలకు(Tribals), కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు వీలుగా అరకులో కొత్త క్యాంప్ ఆఫీస్‌ను కూడా ప్రారంభించారు. ఇదేస‌మ‌యంలో పార్టీ లైన్ ప్ర‌కారం.. విపక్ష నేతగా కూటమి ప్రభుత్వంపై నిర‌స‌న  కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. త‌మ కార్యకర్తలను అక్రమంగా  అరెస్టు చేస్తున్నార‌ని, రాజకీయ వేధింపులకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, అరకు ఎంపీగా తొలిసారి ఎన్నికైనప్పటికీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి(Dr. Gumma Thanuja Rani) అటు పార్లమెంట్‌లోనూ, ఇటు నియోజకవర్గంలోనూ గిరిజన సమస్యలపై గట్టిగానే పోరాడుతూ చురుకైన యువ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ.. పార్టీ ప‌రంగా ఆమెకు త‌గినంత ప్రోత్సాహంక‌నిపించ‌డం లేద‌నే వాద‌న ఉంది. పార్టీ ప‌రంగా ఆమె ఒంట‌రి పోరాటం చేస్తున్నారా? అనే ప్ర‌శ్న కూడా వ‌స్తోంది. మ‌రోవైపు.. అర‌కులో పాగా వేసూఏందుకు జ‌న‌సేన తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇవ‌న్నీ.. అధిగ‌మించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యం  కోసం త‌నూజ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. పార్టీప‌రంగా ఆమెకు త‌గిన విధంగా ప్రోత్సాహం ల‌భించాల్సి ఉంద‌ని అంటున్నారు.

Tags
Dr Gumma Thanuja Rani Araku MP YSRCP Araku MP Araku AP News Tribals Janasena Araku politics Andhra Pradesh
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News