తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ జోరందుకుంటోంది. అధికారం దక్కించుకోవాలన్నా, కోల్పోయిన పవర్‌ను తిరిగి చేజిక్కించుకోవాలన్నా ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చేశారు మన రాజకీయ నాయకులు. ఏపీ(AP) అయినా, తెలంగాణ అయినా ప్రస్తుతం అందరి చూపు బాటసారుడిగా మారడంపైనే ఉంది. ప్రజల మధ్యకు నడిచివెళ్లి, వారి కష్టాలు తెలుసుకుంటూనే... సీఎం పీఠంపై తమ వశం అవుతుందనే సరికొత్త మాస్టర్ ప్లాన్లకు తెరలేపుతున్నారు.
జగన్ నుంచి కేటీఆర్ దాకా సేమ్ రూట్!
వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్(Jagan) ఇప్పటికే తన కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ.. మరో రెండున్నరేళ్లు కళ్ళు మూసుకుంటే పాదయాత్రతో మళ్లీ పవర్‌లోకి వచ్చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అప్లై చేయాలని చూస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, కేడర్లో జోష్ నింపాలని భావిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారాలని చూస్తున్న కల్వకుంట్ల కవిత సైతం పాదయాత్ర ద్వారానే సీఎం పీఠాన్ని టార్గెట్ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు వైసీపీకి గుడ్ బై చెప్పి సొంత బాట పట్టాలనుకుంటున్న విజయసాయి రెడ్డి కూడా ఏపీలో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం ఈ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తోంది.
అధికారం కోసం ప్రతిపక్షాలు, అసంతృప్త నేతలు ఇలా వరుసపెట్టి రోడ్డెక్కుతామని చెబుతుంటే.. పవర్‌లో ఉన్న ప్రభుత్వాలు మాత్రం చూస్తూ ఊరుకుంటాయా? ఖచ్చితంగా లేదు. గతంలో లోకేష్ చేసిన 'ప్రజాగళం' పాదయాత్ర తెచ్చిపెట్టిన రాజకీయ మైలేజీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ(TDP), జనసేన కూటమి కూడా 2029 కోసం ముందస్తు వ్యూహాలు రచిస్తున్నాయి. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేటీఆర్ పాదయాత్రకు కేవలం పర్మిషన్లిచ్చి ప్రేక్షక పాత్రలో ఉండిపోతుందనుకోవడం పొరబాటే అవుతుంది. మొత్తానికి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో మాటల యుద్ధాలు కనుమరుగై, పాదయాత్రల హోరు తారాస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముఖ్యమంతి పీఠం ఎక్కేందుకు బాటసారులవుతున్న ఈ నేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.