టాలీవుడ్(Tollywood)లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా టర్న్ అయిన బండ్ల గణేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక పాత చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష, రూ. 95 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది..?
గతంలో మద్దిరాలపాడుకి చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకి బండ్ల గణేశ్(Bandla Ganesh) రూ.95 లక్షలు బాకీ ఉన్నాడు. అయితే దీన్ని తీర్చే క్రమంలో కొంతకాలం క్రితం తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్ జారీ చేశారు. అయితే, ఆ చెక్ కాస్తా బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై ఒంగోలు కోర్టులో సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సాక్ష్యాధారాలను పరిశీలించి బండ్ల గణేష్‌పై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా ఖరారు చేశారు. అంతేకాకుండా, ఈ కేసు విచారణ ప్రక్రియలో బాధితుడు ఎదుర్కొన్న న్యాయపరమైన ఖర్చులను కూడా బండ్ల గణేషే భరించాలని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం.
కాగా, బండ్ల గణేష్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రుణాల అంశాలు వార్తల్లో నిలిచాయి. కొన్ని నెలల క్రితం రచయిత వక్కంతం వంశీ(Vakkantham Vamsi) వేసిన చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు జైలు శిక్ష, జరిమానా విధించగా.. బండ్ల గణేష్ అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు వెలువరించిన ఈ తాజా తీర్పుతో ఆయన ఎలాంటి లీగల్ మూవ్‌మెంట్స్ తీసుకుంటారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.