ఆ దర్శకులపై కోన కామెంట్స్!

admin
Published by Admin — October 14, 2026 in Movies
News Image

సరైన ప్లానింగ్ లేకుండా నిర్మాతలతో విపరీతంగా ఖర్చు పెట్టించి నష్టాల్లోకి నెట్టే దర్శకులు క్రిమినల్స్ అని.. అలాంటి వాళ్లను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని సీనియర్ రైటర్ కోన వెంకట్ ఫైర్ అయ్యారు. సినిమాలకు వర్కింగ్ డేస్ విపరీతంగా పెరిగిపోతుండం.. రష్ ఎక్కువై ఎడిటింగ్ టేబుల్ దగ్గర తలలు పట్టుకోవడం.. తర్వాత సినిమాను నిర్దిష్ట నిడివికి కట్ చేయడానికి నానా తంటాలు పడడం.. ఇష్టానుసారం సన్నివేశాలను కట్ చేయడం.. ఈ ఒరవడి ఇండస్ట్రీలో పెరిగిపోతుంది. 

ఈ మధ్యే వచ్చిన ఓ సినిమాకు కూడా ఇలాగే జరిగిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన సమర్పణలో వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్.. ఇలాంటి దర్శకుల మీద మండిపడ్డారు. ప్రస్తుతం చాలామంది దర్శకులకు కథ విషయంలో క్లారిటీ ఉండట్లేదని.. సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా మూడు గంటలకు పైగా రష్ తీస్తున్నారని.. తీరా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక గంట గంటంబావు సన్నివేశాలను కోసి పడేస్తున్నారని కోన అన్నారు. మరి కోత పెట్టిన ఈ గంట మీద పెట్టిన ఖర్చు మాటేంటని ఆయన ప్రశ్నించారు. అది నిర్మాత డబ్బే కదా.. ఆయనకో కుటుంబం, భార్యాపిల్లలు ఉంటారు కదా.. ఆయనకు నష్టం వాటిల్లితే ఎవరిది బాధ్యత అని కోన అన్నారు. 

కేవలం ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని.. ఇలా ఇష్టానుసారం సినిమా తీసేవాళ్లు క్రిమినల్స్ అని.. అలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని.. ఇండస్ట్రీ నుంచి వాళ్లను బ్యాన్ చేయాలని కోన అన్నారు. రైటింగ్ దగ్గరే క్లారిటీ ఉంటే.. సరిగ్గా ప్లాన్ చేసి సినిమా తీస్తే ఇలాంటి సమస్యలు ఉండవని.. కానీ అది చేయలేక నిర్మాతల మీద భారం మోపుతున్నారని ఆయన దర్శకుల మీద మండిపడ్డారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ విషయానికి వస్తే.. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Tags
Kona Venkat's shocking comments on directors
Recent Comments
Leave a Comment

Related News