నార్వే..ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఆ దేశ ప్రజలు సంతోషంగా జీవించేందుకు అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి సింప్లిసిటీ. రాజకీయ నాయకులైనా సరే సాదాసీదాగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే, ఆ దేశానికి చెందిన మేయర్ ఒకరు మన దేశంలో ఆటోలో ఒక సగటు పర్యాటకుడిలా తిరుగుతున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ నుండి కేరళ వరకు నార్వే మేయర్ ఆటోలో భారత దేశంలో పర్యటిస్తున్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
నార్వేలోని పోర్సాంగర్ మునిసిపాలిటీ మేయర్ జో ఇంగె హెస్జెవిక్ భారత్ లో పర్యటిస్తున్నారు.
ఆయనకు తోడుగా ఆయన మేనల్లుడు ఓయ్వింద్ హెస్జెవిక్ ఉన్నారు. The Adventurists సంస్థ నిర్వహించే Rickshaw Run India అనే అడ్వెంచర్ ఈవెంట్ లో వారు పాల్గొన్నారు. జైసల్మేర్ (రాజస్థాన్) నుండి ఫోర్ట్ కొచ్చి (కేరళ) వరకు సుమారు 3,500 - 4,300 కిలోమీటర్ల మేర ఆటోలో ప్రయాణించడం వారి టార్గెట్. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు అంటే 13-14 రోజుల్లో ఆ టార్గెట్ పూర్తి చేయాలి.
కానీ, కండిషన్స్ అప్లై. గూగుల్ మ్యాప్ వాడకూడదు. ఫిక్స్ డ్ రూట్ ఉండదు. ఆటోలో సాంకేతిక సమస్యలు, రిపేర్లు వస్తే వాళ్లే చూసుకోవాలి. ఇలా దేశం కాని దేశంలో ఈ తరహా ఛాలెంజ్ ను వారిద్దరు స్వీకరించడం విశేషం. ఈ ఈవెంట్ లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు దాదాపు రూ.3 లక్షలు. ఒక్క ఆటోకి రోజు ఖర్చు కనీసం పది వేలు అవుతుంది. ఇక, భోజనం, పెట్రోల్, హోటల్ వగైరా ఖర్చులు అదనం.
ఈ టూర్ వారికి అంత సులువుగా సాగలేదు. పాకిస్థాన్ బోర్డర్ దగ్గర హోటల్ లో విదేశీయులకు ఎంట్రీ లేదన్నారు. దీంతో, సూర్యాస్తమయం తర్వాత ఇంకో 100 కి.మీ చీకట్లో డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఎదురుగా లైట్లు డిమ్ చేయకుండా దూసుకువస్తున్న వాహనాలు, రోడ్డు మీద ఆవులు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో వారు ప్రయాణం చేశారు. ఒక కారు ఆవును ఢీకొట్టిన దృశ్యం చూసి కూడా వారు భయపడకుండా ప్రయాణం కొనసాగించారు. గుజరాత్ లో చింతన్ అనే కుర్రాడు వారిని కలిశాడు. వారి గురించి గూగుల్ చేస్తే ఆయన మేయర్ అని తెలిసింది. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అలా ఆయన గురించి, ఆ టూర్, ఈవెంట్ గురించి ప్రపంచానికి తెలిసింది.
ముంబై దగ్గర కొండల్లో రెయిన్ ఫారెస్ట్ లో డ్రైవ్ బాగా నచ్చిందని హెస్జెవిక్ చెప్పారు. భారత దేశమంటే ఇంత అందమైన ప్రకృతి కూడా ఉందని తెలియదని, చాలా క్లీన్ గా ఉంది ఆ మామా, అల్లుళ్లు ఆశ్చర్యపోయారు.
గోవా దాటేసరికి ఆటో అద్దం ఊడిపోయిందని, బోల్టులు లూజ్ అయ్యాయిని, ఆటోకు కొత్త డెంట్లు వచ్చాయని చెప్పారు. టుక్టుక్ లో అంటే ఆటోలో నెమ్మదిగా, దగ్గరగా ప్రయాణిస్తే దేశాన్ని నిజంగా ఫీల్ అవుతామని, అందుకే ఈ ఛాలెంజ్ స్వీకరించామని వారు చెప్పారు. ఇదే మన దేశంలోని రాజకీయ నాయకులు విదేశాల్లో పర్యటిస్తే చాలు మీడియా పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని, కానీ, అక్కడి మేయర్ ఇక్కడ ఆటోలో తిరుగుతున్నా...ఒక్క వార్త రాలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలా సింపుల్ గా, హ్యాపీగా ఉన్నారు కాబట్టే నార్వే హ్యాపీ కంట్రీస్ ఇండెక్స్ లో ఎప్పుడూ టాప్ 10లోనే ఉంటుందని ప్రశంసిస్తున్నారు.