దీపావళిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతం బస్తర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందితో కలిసి ఆయన దీపావళి పండుగను నిర్వహించారు. ఒకప్పుడు నక్సల్ ఇక్కడి ప్రాంతాల్లో జాతాల పేరుతో కదం తొక్కారు ఆడిపాడారు. తాజాగా అవే ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భద్రతా సిబ్బందితో కలిసి.. ఆడిపాడారు.వారికి మిఠాయిలు కూడా తినిపించారు.
అనంతరం ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. దీనిలో అనేక అంశాలనుఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా `దేశంలో అంతర్గత శత్రువులు` అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బస్తర్ అంటే.. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోట. ఇక్కడకు వేరేవారు అడుగు పెట్టాలంటే గుండెల్లో ధైర్యం అరువు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. అలాంటి చోట నక్సల్స్ లేకుండా చేయడం గమనార్హం. ఆపరేషన్ ప్రహార్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం నక్సల్స్ బెడదను దాదాపు తగ్గించింది.
అయితే.. వీరిని అంతర్గత శత్రువులుగా తాజాగా ప్రధాని అభివర్ణిస్తూనే.. కొందరిని మాత్రమే నిర్మూలించామని.. మరికొందరిని ప్రజలే పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహా.. ప్రభుత్వా న్ని ప్రశ్నిస్తున్నవారిపైనే తన వ్యాఖ్యలను ఎక్కు పెట్టారన్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత శత్రుత్వం దేశానికి మంచిది కాదన్న ప్రధాన మంత్రి.. దీని ద్వారా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. అయితే.. ఇంకా అంతర్గత శత్రువులతోమనం పోరాడుతూనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో మోడీ సర్కారును సమర్థించే వారు.. ఇదేసయమంలో వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో సర్ ప్రక్రియ సహా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విషయాలపై ప్రతిపక్షాలు విజృంభించాయి. నిరసనలుతీవ్రతరం చేశాయి. దీంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయంటూ ఢిల్లీ వ్యాపారుల సంఘం లబోదిబోమంది. ఈ పరిణామాల క్రమంలోనే పరోక్షంగా ప్రధాని మోడీ.. `అంతర్గత శత్రువులు` అనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.