స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. నామినేషన్ల పర్వం చివరి దశకు చేరిన వేళ, సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశం పూర్తిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సర్దుబాటు చుట్టూనే తిరిగింది. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో విజయవంతమైన ఫార్ములాలనే, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అమలు చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సీట్ల కేటాయింపుపై స్పష్టత కొరవడటం, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన పట్టున్న కొన్ని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లేదా 8 జెడ్పీ స్థానాలను ఆశిస్తున్న జనసేన(Janasena)... ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని కీలక స్థానాలను తమకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే కొన్నిచోట్ల టీడీపీ, జనసేన స్థానిక క్యాడర్ మధ్య సీట్ల కేటాయింపు విషయమై చిన్నపాటి ఘర్షణలు, గందరగోళం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగుస్తుండటంతో, ఎక్కడా ప్రచారం లేదా నామినేషన్ల దాఖలులో పరస్పర విమర్శలకు తావులేకుండా ఉండేలా అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.
అలాగే ఎన్నికల వేళ తలెత్తే రెబల్స్ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా చంద్రబాబు, పవన్(Pawan Kalyan) లోతుగా చర్చించారు. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు పోను, మిగిలిన చోట్ల పోటీ చేస్తున్న ఆశావహులను సమన్వయం చేసుకునే బాధ్యతను పార్టీల పెద్దలు తమ భుజాన వేసుకున్నారు. ఎక్కడా కూటమి ఓట్లు చీలకుండా, మూడు పార్టీల శ్రేణులు సమష్టిగా పనిచేసేలా క్షేత్రస్థాయికి స్పష్టమైన సంకేతాలు పంపాలని నిర్ణయించారు. పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీల అధినేతలు వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.