శ్రీసత్యసాయి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఉమ్మడి అనంతపురం రాజకీయాల్లో ఎంతో బలమైన నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబం నుంచి మరోసారి యువనేత రంగంలోకి దిగుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ(TDP) ఈసారైతే జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ను జెడ్పీ చైర్మన్ బరిలో నిలపాలని అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా శ్రీరామ్(Paritala Sriram) తొలుత నల్లచెరువు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. కదిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ నల్లచెరువు స్థానం జనరల్ కేటగిరీ కింద కేటాయించడంతో, ఇక్కడి నుంచే ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చైర్మన్ పీఠం దక్కాలంటే ముందుగా జెడ్పీటీసీగా గెలవడం నిబంధన కావడంతో, క్షేత్రస్థాయి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికను కేవలం సాధారణ పోటీలా కాకుండా, జిల్లా వ్యాప్తంగా పార్టీ పట్టును నిరూపించుకునే వేదికగా టీడీపీ మలచుకుంటోంది.
మరోవైపు పరిటాల శ్రీరామ్ నామినేషన్ ఘట్టాన్ని కూటమి నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన(Janasena), బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని భావిస్తున్నాయి. కేవలం నామినేషన్ పర్వంతోనే ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపాలని కూటమి నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
యువ నాయకుడిగా పరిటాల శ్రీరామ్‌కు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగిస్తే కేడర్‌లో కొత్త జోష్ వస్తుందని పార్టీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. నల్లచెరువులో మొదలయ్యే ఈ ప్రయాణం, చివరికి శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District)పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు దూసుకెళ్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకూ ఈ గెలుపు ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.