గత వారం రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆర్నబ్ తుఫానుగా మారింది. ఫలితంగా ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లోని జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సాంకేతికత కారణంగా.. ఈ తుఫాను గమన వేగాన్ని.. రాబోయే మార్గాన్ని ముందుగానే అంచనా వేసిన నేపథ్యంలో తుఫాను వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించే చర్యలు అయితే తీసుకున్నారు. ఏపీ.. ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు 12 ప్రధాన జిల్లాల్లో ఈ తుపాను మంగళవారం రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది.
ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు చేరారు. వేల కొద్దీ కొబ్బరి చెట్లు కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు కూడా నేలమట్టం అయ్యాయి. కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం.. అత్యంత ప్రమాదకరంగా మారింది. దాదాపు 20 మీటర్ల ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసి పడుతున్నాయి. రహదారులు చిన్నా భిన్నం అయ్యాయి. 125 కిలో మీటర్ల వేగంతో రాకాసి గాలులు వీస్తున్నాయి.
అసలు ఏంటీ తుఫాను..
బంగాళాఖాతంలో ఈ నెల 25న ఏర్పడిన ఉష్ణమండల అల్పపీడనం.. తర్వాత కాలంలో తుఫానుగా మారింది. అయితే.. ఏటా వచ్చే తుఫానులకు ఒక్కొక్కొ దేశ ఒక్కొక్క పేరును సూచిస్తుంది. ఈ ఏడాది వచ్చే తుఫానులను బంగ్లాదేశ్ గతంలోనే సూచించిన పేర్లను పెడుతున్నారు. ఇలా.. తాజాగా వచ్చిన తుపానుకు ఆర్నబ్ పేరును పెట్టారు. బంగ్లా భాషలో ఆర్నబ్ అంటే.. సముద్రం.. లేదా మహాసముద్రం అని అర్ధమట. అలా.. ఆ దేశం సూచించిన పేరును దీనికి పెట్టడం గమనార్హం.
తీరం దాటడం అంటే ఏమిటి?
ఆర్నాబ్ తుపాను తీరం దాటుతోంది అంటూ.. వార్తలు వచ్చాయి. అయితే..అసలు ఏ తుఫానైనా తీరం దాటడం అంటే ఏంటి? అనేది సందేహం. సముద్రంలో పుట్టిన ఒక మహా గాలి చక్రం, నెమ్మదిగా పయనిస్తూ.. భూమి మీదికి రావడాన్నే తీరం దాటడం అంటారు. తుపాను అనేది వందల కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ మేఘాల గుంపు. దానికి సరిగ్గా మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. శాస్త్రవేత్తలు దాన్ని తుపాను కన్ను అంటారు. తుపాను మొత్తం సముద్రంలో ఉన్నప్పుడు ఎవరికీ పెద్దగా ముప్పు ఉండదు. ఎప్పుడైతే ఆ మధ్యలోని కన్ను సముద్రపు నీటిని వదిలి, నేల మీదకు అడుగు పెడుతుందో, సరిగ్గా దాన్నే తీరం దాటడం / ల్యాండ్‌ఫాల్ అంటారు. ఇప్పుడు ఆర్నబ్ విషయంలోనూ అదే జరిగింది.