గుంటూరు మేయర్‌గా జగపతిబాబు చెల్లెలు విక్టరీ

admin
Published by Admin — November 04, 2026 in Politics, Andhra
News Image

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితలతో(AP Municipal Election Result) మరోసారి కూటమి సత్తా ఏంటో స్పష్టమైంది. ముఖ్యంగా పాలిటిక్స్ అండ్ సినిమా సెంటిమెంట్‌ల కలబోతగా మారిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. గ్రేటర్ గుంటూరుగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత జరిగిన ఈ తొలి ప్రత్యక్ష మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మహిళలకు రిజర్వ్ అయిన ఈ మేయర్ స్థానం కోసం హోరాహోరీ పోరు నడిచింది. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికలో ప్రజలు కూటమి వైపే నిలిచారు. వైఎస్ఆర్‌సీపీ(YSRCP) అభ్యర్థి తాడికొండ శ్రీదేవిపై అపర్ణ ఏకంగా 96,294 ఓట్ల భారీ మెజారిటీతో దూసుకెళ్లారు. లక్ష్మీ అపర్ణకు 2,08,925 ఓట్లు రాగా, శ్రీదేవి 1,12,631 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ భారీ విజయంతో గుంటూరు ప్రథమ పౌరురాలిగా అపర్ణ పీఠం అధిష్టించారు.

ఈ విజయం వెనుక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యమే ఉంది. 2021లో వైఎస్ఆర్‌సీపీ హవా నడిచిన సమయంలోనూ, తర్వాతి పరిణామాల్లో కోవెలమూడి అపర్ణ(Kovelamudi Lakshmi Aparna) భర్త కోవెలమూడి రవీంద్ర గుంటూరు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఏడాది తిరగకుండానే పదవీకాలం ముగియడంతో, ఇప్పుడు సరిగ్గా అదే పీఠంపై ఆయన సతీమణి లక్ష్మీ అపర్ణ కూర్చోవడం విశేషం. ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలిద్దరూ వరుసగా మేయర్ పదవిని చేపట్టడం గుంటూరు రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

కేవలం మేయర్ పదవి మాత్రమే కాకుండా, కార్పొరేషన్ వార్డుల పీఠాలపై కూటమి గట్టి పట్టు సాధించింది. మొత్తం 76 వార్డుల్లో టీడీపీ(TDP) 48 వార్డులు గెలుచుకుంది. జనసేన 13, బీజేపీ 3 వార్డులు సాధించాయి. అంటే కూటమి మొత్తం 64 వార్డులతో కార్పొరేషన్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. వైఎస్ఆర్‌సీపీ 11 వార్డులకే పరిమితమైంది, ఒక వార్డు స్వతంత్ర అభ్యర్థి ఖాతాలో చేరింది. 

సినీ గ్లామర్ అండ్ పక్కా వ్యూహం
ఈ ఎన్నికల్లో అపర్ణ గెలుపు కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నేతలే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు సైతం డిజిటల్ ప్రచారంతో జోష్ నింపారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు జగపతిబాబు(Jagapathi Babu) ప్రత్యేక వీడియో సందేశాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. నిజానికి అపర్ణ భర్త రవీంద్ర, రాఘవేంద్రరావుకు స్వయానా సోదరుడు, అంటే రాఘవేంద్రరావుకు అపర్ణ వరుసకు మరదలు. నటుడు జగపతి బాబుకు ఆమె వరుసకు చెల్లెలు. ఇలా సినిమా రంగం నుంచి వచ్చిన మద్దతు ప్రచారానికి అదనపు ఆకర్షణ తెచ్చింది. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను సమన్వయం చేస్తూ కూటమి నేతలు వేసిన మాస్టర్ ప్లాన్ గుంటూరులో అఖండ విజయాన్ని అందించింది. ఈ గెలుపుతో గుంటూరు నగరంలో కూటమి శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నాయి.

Tags
Guntur Mayor Kovelamudi Lakshmi Aparna AP Municipal Elections 2026 TDP Guntur Jagapathi Babu
Recent Comments
Leave a Comment

Related News