బీజేపీతో టీడీపీ(TDP) పొత్తు పెట్టుకునే విషయంలో కొత్తగా ఒక కీలక అంశం తెర మీదకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి. ఇదే పొత్తును వచ్చే ఎన్నికల్లోను కొనసాగించాలని ఏపీలో ఈ మూడు పార్టీలు తీసుకున్న కీలక నిర్ణయం. ఇక ఈ పొత్తును కేంద్రంలోనూ కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి టీడీపీ జనసేన పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వారి బలంతోనే ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు చర్చ అంతా తెలంగాణ(Telangana) గురించే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలన్నది కమలనాధుల ఆలోచన. తెలంగాణ ఆవిర్భవించి పుష్కరకాలం దాటిన తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ పుంజుకోలేకపోవడంతో పాటు అధికారంలోకి వచ్చేందుకు పెద్దగా అవకాశాలు కూడా కనిపించకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చి మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని తెలిసి చెప్పారు.
అనంతరం ఒక కీలక అంశం జరిగిందన్నది బీజేపీ(BJP) వర్గాల్లో జరుగుతున్న చర్చ. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలన్నది బీజేపీ చేస్తున్న ఆలోచన. అయితే ఇక్కడ చిన్న సెంటిమెంట్ విషయం అడ్డం వస్తోంది. అదే ఆంధ్ర పార్టీలుగా టీడీపీ, జనసేన లపై ఒకింత ముద్ర ఉన్న విషయం తెలిసిందే. దీనివల్ల తెలంగాణలో దెబ్బ పడుతుందని.. బీజేపీకి ఉన్న సంస్థాగత ఓటు బ్యాంకు కూడా పోయే ప్రమాదం ఉందని.. అక్కడి నాయకులు భావిస్తుండగా అమిత్ షా మాత్రం దీనికి భిన్నమైన ఆలోచన చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్టీలు పరంగా బలంగా ఉన్నంత మాత్రాన ఇబ్బందులేదని, ప్రజల అభిప్రాయాలను మార్చే స్థాయిలో పార్టీలు వ్యవహరించవచ్చని ఆయన తేల్చి చెప్పారు. పైగా తరచుగా ఏపీ(AP) తెలంగాణల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడుతున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏపీ తెలంగాణ భావజాలాన్ని ఒకప్పుడు పెంచి పెద్దది చేసినా.. ఇప్పుడు అది లేదని ఆ ప్రభావం పెద్దగా పడదని, అభివృద్ధి- పెట్టుబడులు అదేవిధంగా ప్రజల సంక్షేమం ఇటువంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రచారం చేయడం ద్వారా ఆంధ్ర రాజకీయ ముద్రను చెరిపేయవచ్చు అన్నది అమిత్ షా చెప్పినట్టుగా పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తుంది.
ఈ కోణంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కూడా అమిత్ షా చెప్పినట్టు సమాచారం. టీడీపీ విషయానికి వస్తే తెలంగాణలో బలమైన సంస్థాగత ఓటు బ్యాంకు ఉంది. అలాగే ప్రజల్లోను సానుకూలత ఉంది. హైదరాబాద్చ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో టీడీపీకి సానుకూల ఓటు బ్యాంకు స్పష్టంగా ఉంది. ఇక జనసేన ఎలానో తెలంగాణలో పుంజుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కూటమిగా ముందుకు వెళ్లడం ద్వారా కచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కవచ్చన్నది బీజేపీ అగ్ర నాయకుడి ఆలోచనగా పార్టీ నాయకులు చెబుతున్నారు. సో ఈ పరిణామాల క్రమంలోనే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం పై చర్చలు ప్రారంభించాలని కూడా అమిత్ షా(Amit Shah) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.