ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రస్తుత ఏలూరు(Eluru) జిల్లా రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు వింటేనే ఒక జోరు, ఒక ఊపు కనిపిస్తాయి. దెందులూరు రాజకీయాల్లో తిరుగులేని ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న ఆయన, తనదైన శైలిలో పాలిటిక్స్ నడిపిస్తుంటారు. అయితే, ఎంత సీనియర్ నాయకుడైనా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు మంత్రి పదవి మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనను పదవి వరించలేదనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. సరిగ్గా ఈ లోటును భర్తీ చేసేందుకే ఇప్పుడు చింతమనేని ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ(Chintamaneni Navya Sri) అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. పెదవేగి జెడ్పీటీసి స్థానం నుంచి బరిలోకి దిగిన ఆమెకు ప్రత్యర్థుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. చివరి నిమిషంలో నామినేషన్ల నుంచి ప్రత్యర్థులు తప్పుకోవడంతో సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాధారణంగా ఎంట్రీ ఇవ్వడమే జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం సాధారణ విషయం కాదు. దీని వెనుక బలమైన రాజకీయ భరోసా, వ్యూహాత్మక పావులు ఉన్నాయని స్పష్టమవుతోంది. కేవలం ఒక జెడ్పీటీసీ స్థానానికే పరిమితం కావడానికి కాకుండా, నేరుగా ఏలూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠాన్నే టార్గెట్ చేసే ఆమెను బరిలోకి దింపారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రధాన చర్చ.
అయితే, ఈ పీఠం అంత సులువుగా దక్కేలా లేదు. ఇదే జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై మరో సీనియర్ నేత, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి(Ganta Murali) కూడా గట్టిగా కన్నేశారు. తన కుమార్తె మందలపు జాహ్నవిని జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒకే ఒక్క చైర్ పర్సన్ పదవి కోసం ఇద్దరు సీనియర్ నేతల రాజకీయ వారసురాళ్లు ముఖాముఖి తలపడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఫైర్ బ్రాండ్ చింతమనేని వ్యూహాలు, మరోవైపు గంటా మురళి తెరవెనుక ప్రయత్నాలు ఏలూరు పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించాయి.
కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో పట్టు మరింత పెంచుకోవాలని చూస్తున్న చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar)కు, తన కుమార్తెను చైర్ పర్సన్ చేయడం ద్వారా కుటుంబానికి సముచిత స్థానం కల్పించాలనే బలమైన కోరిక ఉంది. టీడీపీ హైకమాండ్ కూడా సీనియర్ నేత అయిన చింతమనేని సేవలను, ఆయన పట్టును దృష్టిలో ఉంచుకుని ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. మరి ఈ ఇద్దరు సీనియర్ల మధ్య నడుస్తున్న పొలిటికల్ గేమ్‌లో చివరికి ఎవరి కుమార్తె ఆ అదృష్టాన్ని దక్కించుకుంటారు? ఏలూరు జెడ్పీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనేది ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.