ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఏ విషయంలోనైనా అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. పాలక, ప్రతిపక్షాల మధ్య నిత్యం జరిగే విమర్శలు, ప్రతివిమర్శలు సోషల్ మీడియాలో నిత్యం రచ్చలేపుతుంటాయి. అయితే, ఇరువర్గాల మధ్య ఎంతటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ... తాజాగా మానవీయ కోణంలో, వ్యక్తిగత విషయాల పట్ల గౌరవం ప్రదర్శించడంలో మాత్రం ఒక అరుదైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అన్నా కొణిదెల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, భవిష్యత్తులోనూ మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ తమ పిల్లల బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత గోప్యతను వారు గౌరవించాలని, ఈ సున్నితమైన సమయంలో తమను అర్థం చేసుకోవాలని వారు కోరారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ రంగు పులమకుండా ఉండటానికి రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ(TDP) అధికారిక సోషల్ మీడియా వింగ్ (ఐటీడీపీ) చాలా స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్, అన్నా విడాకుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినా, కించపరిచేలా పోస్టులు పెట్టినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అనూహ్య రీతిలో స్పందించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై చర్చించడం లేదా ఎలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం చేయరాదని తన శ్రేణులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. గతంలో పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా వాడుకున్న వైసీపీ(YCP), ఈసారి మాత్రం హుందాగా వ్యవహరించి సంయమనం పాటించడం విశేషం.
రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉండే ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ ఒక వ్యక్తిగత సున్నితమైన అంశం వచ్చేసరికి బాధ్యతాయుతంగా మెలగడం, సోషల్ మీడియా(Social Media)లో ఎలాంటి ట్రోలింగ్‌కు తావివ్వకుండా కఠిన ఆంక్షలు విధించడం నిజంగానే రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన మార్పుకు సంకేతంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు అనే పరిణతిని ఈ రెండు పార్టీలు చూపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.