రాష్ట్రంలో గొడ్డలిపార్టీ తీరుతెన్నులను భేరీజు వేసుకుని.. అసలు ఆ పార్టీ అవసరం ఉందా? అనే విషయంపై ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక శక్తిగా గొడ్డలి పార్టీ ఆవిర్భవించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేప్రయత్నం చేసిందని.. కోర్టుకు వెళ్లి ఏవేవో కారణాలు చెప్పిందని అన్నారు.
అదేసమయంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి.. వారికి రాజ్యాధికారం కల్పించాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే.. దీనికి కూడా గొడ్డలి పార్టీ అడ్డు పడిందన్నారు. సుప్రీంకోర్టులో బీసీల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు వేసిందని తెలిపారు. రక్త తర్పణాలు, రప్పా రప్పా.. నినాదాలు వంటివి ప్రచారం చేస్తూ.. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నాలు చేసిందన్నారు.
అయినప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కూటమిపార్టీల తరఫున ముఖ్యంగా టీడీపీ తరఫున ప్రాధాన్యం పెంచామ ని కొన్ని చోట్ల 50 శాతం రిజర్వేషన్ కూడా అమలు చేశామని చెప్పారు. ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్న గొడ్డలి పార్టీ విధానాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో పునర్నిర్మాణ యజ్ఞాన్ని రెండు సంవత్సరాల కిందట ప్రారంభించి కొనసాగిస్తున్నామన్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటున్నట్టు తెలిపారు.
ఇటీవల రెండు తుఫాన్లు వచ్చాయని.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగంతో నిరంతరం పనిచేయించామని.. తాను స్వయంగా ఆర్టీజీఎస్లో కూర్చుని పరిస్థితిని సమీక్షించి.. ఇబ్బందులు తొలగించేలా చేశామన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. కానీ, ఆ సమయంలో కూడా గొడ్డలి పార్టీ ప్రజలను పట్టించుకోలేదని.. పైగా లేనిపోని విమర్శలు చేసి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శించారు.
ప్రజలను పట్టించుకోని పార్టీ ఎందుకని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనూ గొడ్డలిపార్టీ నాయకులు ఉద్దేశ పూర్వకంగా అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం సృష్టించారని అన్నారు. తద్వారా ఎన్నికలను నిలిపివేయాలన్నది వారి ఉద్దేశమని తేల్చి చెప్పారు. కానీ,ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను కాపాడుతూనే స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు.