టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి క‌న్నుమూత‌.!

admin
Published by Admin — November 12, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలందించిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగుదేశం పార్టీలోనూ, ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

అంచెలంచెలుగా ఎదిగిన నేత..
జనతా పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేసిన శత్రుచర్ల విజయరామరాజు(Satrucharla Vijaya Rama Raju), ఆ తర్వాత తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రజానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగిన ఆయన, నాగూరు, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి పలుమార్లు విజయం సాధించారు. మొత్తంగా తన రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది చట్టసభల్లో ఉత్తరాంధ్ర గళాన్ని బలంగా వినిపించారు.

మంత్రిగా కీలక బాధ్యతలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా, ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన మృదుస్వభావంతో, పరిపాలనా దక్షతతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారు. కాలక్రమేణా తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 2017లో టీడీపీ(TDP) తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై 2023 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లుగా శత్రుచర్ల విజయరామరాజు అస్తమయం పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Tags
Satrucharla Vijaya Rama Raju TDP AP News Ap Politics Andhra Pradesh Former Minister Visakhapatnam
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News