ఈనాడు దినపత్రిక సహా.. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక చైర్మన్.. దివంగత రామోజీ రావు జయంతిని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో సోమవారం సాయంత్రం నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
పత్రికా రంగానికేకాకుండా.. ప్రజలకు, సమాజానికి కూడా ఆయన విశేష సేవలు చేశారని కొనియాడారు. తుఫాన్లు, వరదల వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగారని చంద్రబాబు కొనియాడారు. ఏపీతో ఆయనకు ప్రత్యేక అనుబం ధం ఉందన్నారు. తాను పుట్టిన గడ్డకు పేరు తీసుకువచ్చారని తెలిపారు.
రాజధాని విషయంలో ఆయనకు సమగ్ర దృక్ఫథం ఉందన్నారు. అందుకే ఎంతో పరిశోధన చేసి.. `అమరావతి` పేరును సూచించారని చెప్పారు. ఆ తర్వాత.. రాష్ట్ర ప్రజలు సైతం ఈ పేరుకు ఆమోదం తెలి పారని వ్యాఖ్యానించారు. రామోజీ గ్రూపు సంస్థలకు నిబద్ధత, క్రమశిక్షణల విషయంలో ప్రత్యేక పేరుందన్నారు. దీనిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. రామోజీ రావు చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని చంద్రబాబు ప్రకటించారు.
ఆ వెంటనే జీవో..
చంద్రబాబు సభా వేదికపై నుంచి ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది నుంచి రామోజీరావు జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. కలెక్టర్ కార్యాలయాల నుంచి సెక్రటేరియట్ వరకు, పోలీసు స్టేషన్ల నుంచి ఎస్పీ కార్యాలయాల వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేసమయంలో విద్యార్థులు, యువతకు రామోజీ జీవితపై అవగాహన కల్పించడంతోపాటు.. స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనికి అయ్యే పూర్తి వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది.