ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వంలో మంత్రులు, అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపుతున్నారు. వెలగపూడి సచివారయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సచివాలయ సమావేశంలో మంత్రుల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్‌ను ఆయన నేరుగా బట్టబయలు చేశారు. ఫైళ్ల పరిష్కారంలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారనే లెక్కలను బయటపెట్టడంతో అసెంబ్లీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిళ్లలోనూ ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రివ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు(Atchannaidu) అగ్రస్థానంలో నిలిచి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. శాఖాపరమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన వేగం చూపించారు. మరోవైపు, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ఫైళ్ల క్లియరెన్స్‌లో చివరి స్థానంలో నిలిచారు. ఆయనతో పాటు మంత్రులు కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్‌లు కూడా ఫైళ్లను పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సీఎం బాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిందేనని స్పష్టం చేయడం విశేషం.
కేవలం మంత్రులే కాకుండా, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీలు) ఫైళ్ల కదలికపై తీసుకుంటున్న సమయంపై కూడా సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది సెక్రటరీలు కేవలం రెండు రోజుల్లోనే ఫైళ్లను క్లియర్ చేస్తుంటే, కొందరు హెచ్‌వోడీలు మాత్రం మూడు రోజులు సాగదీయడంపై మండిపడ్డారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఈ అకారణ జాప్యానికి అసలు కారణమేంటో ఆరా తీయాలని, బాధ్యుల నుంచి వెంటనే వివరణ కోరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను చంద్రబాబు ఆదేశించారు. మొత్తానికి పాలనలో పారదర్శకత, వేగం ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు అధికారుల్లోనూ, మంత్రుల్లోనూ వణుకు పుట్టిస్తున్నాయి.