ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో వినాయచవితి పర్వదినా న్ని కుటుంబ సమేతంగా జరుపుకొన్నారు. అయితే.. ఈ సారి వినాయకచవితి.. చంద్రబాబు దంపతులు కాకుండా.. తమ మనవడు, నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్‌ను పీటలపై కూర్చోబెట్టి.. ప్రత్యేకంగా గణపతి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నా.. వారు కేవలం సహాయకారులుగా మాత్రమే పక్కన కూర్చున్నారు. మొత్తం కార్యక్రమాన్ని మనవడితోనే చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు ప్రజలతోపంచుకున్నారు.
``వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలేనని సీఎం చెప్పారు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకమన్నారు. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించానని తెలిపారు.