గుంటూరు మేయర్ పీఠం.. చెల్లెలు కోసం రంగంలోకి జ‌గ‌ప‌తిబాబు.!

admin
Published by Admin — October 30, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార కూటమి తరఫున మేయర్ బరిలో నిలిచిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం కోసం టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు నేరుగా రంగంలోకి దిగారు. వరుసకు తన చెల్లెలు అయ్యే లక్ష్మీ అపర్ణ(Kovelamudi Lakshmi Aparna)కు మద్దతుగా ఆయన స్వయంగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయడం రాష్ట్రవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రచార గడువు ముగిసే తరుణంలో ఆయన చేసిన ఈ అప్పీల్ కూటమి క్యాడర్‌లో కొత్త జోష్ నింపుతోంది.

కోవెలమూడి కుటుంబానికి గుంటూరు రాజకీయాలతో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల బలమైన అనుబంధం ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ కుటుంబం ఎప్పుడూ ముందుండి కార్యకర్తలకు అండగా నిలిచింది. ఇక లక్ష్మీ అపర్ణ భర్త కోవెలమూడి రవీంద్ర (నాని) గుంటూరు రాజకీయాల్లో సుపరిచితుడైన నేత. ఆయన గతంలో గుంటూరు నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, టీడీపీ(TDP) గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ సేవలు అందించారు. తాజాగా మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో, పార్టీ అధినాయకత్వం లక్ష్మీ అపర్ణను ఈ స్థానానికి అధికారిక అభ్యర్ధిగా ఎంపిక చేసింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె పలు ప్రైవేట్ సంస్థలలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కూడా ఉంది.

"నా చెల్లిని భారీ మెజార్టీతో గెలిపించండి" - జగపతిబాబు విజ్ఞప్తి
గుంటూరు ప్రజలను ఉద్దేశించి జగపతిబాబు(Jagapathi Babu) విడుదల చేసిన వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "2024 ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించిన గుంటూరు ప్రజల చైతన్యం ఎలాంటిదో నాకు తెలుసు. ఇప్పుడు నా చెల్లి లక్ష్మీ అపర్ణను మేయర్‌గా గెలిపించి మరోసారి మీ ఆదరణ చాటుకోవాలని కోరుతున్నాను" అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. లక్ష్మీ అపర్ణకు మంచి మనసు ఉందని, సమర్థురాలైన నాయకురాలంటూ కొనియాడారు. కేవలం మేయర్ అభ్యర్థే కాకుండా, కూటమి తరఫున కార్పొరేటర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచారానికి తుది గడువు ముగియనున్న నేపథ్యంలో, సినీ గ్లామర్ తోడు కావడంతో గుంటూరు మేయర్ ఎన్నికల పోరు రంజుగా మారింది. మరి ఈ సెంటిమెంట్, కూటమి వ్యూహాలు ఏ మేర ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

Tags
Guntur Mayor Jagapati Babu TDP Andhra Pradesh AP Politics Guntur Tollywood Kovelamudi Lakshmi Aparna
Recent Comments
Leave a Comment

Related News