గెలుపు కోసం కోట్లు ఖర్చు పెట్టడం, రాత్రికి రాత్రే ఇళ్ల ముందుకు వచ్చి నోట్ల కట్టలు పంచడం.. నేడు ఎన్నికల్లో సర్వసాధారణంగా మారిపోయిన తంతు. "డబ్బులిస్తేనే ఓటెయ్యాలి, లేదంటే లేదు" అనేలా రాజకీయ నాయకులు ఓటర్లను బానిసలుగా మారుస్తున్న రోజులివి. అయితే, ప్రజాస్వామ్యానికి అసలు సిసలైన అర్థం చెబుతూ, స్వార్థ రాజకీయాలకు చెంపపెట్టులా నిలిచిన ఓ అరుదైన ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వెలుగు చూసింది.
చిత్తూరు(Chittoor) జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్థానిక డిగ్రీ కాలేజీలో ఓ విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలో సిబ్బంది బ్యాలెట్ బాక్సులు తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో ఓటు హక్కు వినియోగించుకున్న పత్రంతో పాటు, రెండు 500 రూపాయల కరెన్సీ నోట్లు (మొత్తం రూ.1000) బయటపడ్డాయి. ఆశ్చర్యమేమిటంటే.. ఆ నోట్ల పక్కనే ఓటరు స్వయంగా రాసిన ఒక చిన్న లేఖ కూడా ఉంది.
ఆ లేఖలో ఆ ఓటరు(Voter) రాసిన మాటలు అప్పట్లో లెక్కించిన సిబ్బందికే కాదు, ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికీ షాకిస్తున్నాయి. "అయ్యా.. మీరిచ్చిన వెయ్యి రూపాయలు మీరే తీసుకోండి. డబ్బులు తీసుకొని ఓటు వేసే వారం కాదు సుమా.. ధన్యవాదాలు" అంటూ అందులో పేర్కొన్నారు. ఓటును అమ్ముకోవడానికి ఇష్టపడని ఆ ఓటరు.. ఎన్నికల ప్రచారంలో నేతలు తమ చేతిలో పెట్టిన డబ్బులను ఇలా బ్యాలెట్ బాక్స్‌లోనే తిరిగి ప్రత్యర్థుల మొహాన కొట్టినట్లుగా పంపడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు ఎత్తులు వేస్తుంటే.. ఈ ఓటరు మాత్రం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని చాటిచెప్పాడు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వస్తువు కాదని, దాన్ని ఎవరూ కొనలేరని ఈ సంఘటన నిరూపించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇది "ఎన్నికల సమగ్రతకు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ" అని కొనియాడారు. డబ్బులొస్తే చాలు మౌనంగా తీసుకునే ఓటర్లున్న ఈ కాలంలో.. "మా ఓటు(Vote) విలువ వెలకట్టలేనిది" అంటూ ఎదురు తిరిగిన ఆ ఓటరు తెగువ చూస్తుంటే.. రాజకీయ నాయకులకు ఇదొక పెద్ద గుణపాఠమనే చెప్పాలి.