వాడుకుని వదిలేశాడు.. త్రివిక్రమ్‌పై హీరోయిన్‌ ఫైర్‌.!

admin
Published by Admin — November 19, 2026 in Movies
News Image

విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47(Aadarsha Kutumbam)’ సినిమా రిలీజ్‌కు ముందే కాక, రిలీజ్ తర్వాతా ఏదో ఒక చర్చతో వార్తల్లో నిలుస్తోంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. ఇదే తరుణంలో ‘రంగస్థలం’ ఫేమ్ పూజిత పొన్నాడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకు వచ్చిన తీరును పూజిత(Poojitha Ponnada) వివరిస్తూ, తాను విదేశాల్లో ఉన్నప్పుడు సినిమా యూనిట్ నుంచి పిలుపు వచ్చిందని తెలిపింది. త్రివిక్రమ్ సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది కదా, అందుకే వెంటనే హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్‌లో పాల్గొన్నానని చెప్పింది. ఆడిషన్ అనంతరం త్రివిక్రమ్ తనను సెలెక్ట్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గుర్తు చేసుకుంది. షూటింగ్ మొదలైన తొలి దశలోనే తనపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని పూజిత వెల్లడించింది. జనవరిలో దాదాపు ఐదు రోజుల పాటు సెట్స్‌లో పాల్గొన్నానని, తన పాత్ర పరిచయ దృశ్యాలతో పాటు నారా రోహిత్‌తో కలిసి కొన్ని సీన్లలో నటించానని పేర్కొంది. అంతవరకు అంతా సాఫీగానే సాగినా, ఆ తర్వాత మూడు నెలల పాటు తదుపరి షెడ్యూల్ గురించి ఎలాంటి సమాచారం లేకుండా పోయిందట.

ఆ గ్యాప్ తర్వాత తానే స్వయంగా అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన రాలేదని పూజిత వాపోయింది. కొంతకాలానికి వేరొక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసి, ప్రస్తుతానికి మీకు షూటింగ్ లేదని చెప్పడంతో తనకు అనుమానం కలిగిందని వివరించింది. గట్టిగా నిలదీసి అడిగితే, తన స్థానంలో మరో నటిని తీసుకున్నారనే విషయం బయటపడిందని చెప్పింది. ఓ పద్ధతి ప్రకారం ఆడిషన్ చేసి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా తనను తప్పించడం తనను తీవ్రంగా బాధించిందని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, థియేటర్లలో సినిమా చూసినప్పుడు తాను ఓ చిన్న సీన్‌లో కనిపించానని, కేవలం ఆ ఒక్క దృశ్యం కోసమే తనను వాడుకుని వదిలేశారని త్రివిక్రమ్‌(Trivikram Srinivas)పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కాగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 30న విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోగా, పూజిత లేవనెత్తిన ఈ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపింది.

Tags
Poojitha Ponnada Aadarsha Kutumbam Venkatesh Trivikram Srinivas Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News