తమిళనాడు(Tamil Nadu) రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా కుదిపేసిన అనూహ్య విజయం, ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)పైనే సంచలన గెలుపు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూశారు. గురువారం నాడు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యలకు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్య వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. 75 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. సిట్టింగ్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పోటీగా విజయ్ నేతృత్వంలోని టీవీకే(TVK) తరఫున వి.ఎస్. బాబు బరిలోకి దిగినప్పుడు, ఫలితం ఏకపక్షంగా ఉంటుందనే అంచనాలు వినిపించాయి. కానీ ఓటర్ల తీర్పు అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఏకంగా 8,795 ఓట్ల భారీ మెజార్టీతో స్టాలిన్‌ను మట్టికరిపించి, వి.ఎస్. బాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఒక్క గెలుపుతో ఆయన టీవీకేలో తిరుగులేని హీరోగా మారిపోయారు.
అలాగే వీ.ఎస్. బాబు(VS Babu) రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపుల సమాహారం. చెన్నై నగర రాజకీయాల్లో, ముఖ్యంగా అర్బన్ ఓటర్లపై ఆయనకు బలమైన పట్టు ఉండేది. టీవీకేలో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బాబు, గతంలో డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీల్లోనూ పనిచేశారు. ఉత్తర చెన్నై నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే 2006–2011 మధ్య కాలంలో చెన్నై కార్పొరేషన్‌తో పాటు ఇతర కీలక పదవుల్లోనూ రాణించారు. సాధారణ నేపథ్యం నుంచి ఎదిగిన నేతగా వి.ఎస్. బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చదువు 8వ తరగతి వరకే పరిమితమైనప్పటికీ, క్షేత్రస్థాయి అనుభవం, ప్రజలతో మమేకమయ్యే తత్వమే ఆయనను పెద్ద పదవుల వైపు నడిపించాయి. బలమైన రాజకీయ ఉద్దండుడినే ఢీకొట్టి విజయం సాధించిన ఈ సీనియర్ నేత అకస్మాత్తుగా దూరం కావడం కొలత్తూరు ప్రజలకు, టీవీకే పార్టీకి తీరని లోటుగా మిగిలింది.