పంచాయతీ ఎన్నికల(Ap Panchayat Election) వేడి గ్రామీణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. తొలిదశ పోలింగ్‌లో ఎదురులేని ఆధిక్యాన్ని కనబరిచిన కూటమి పార్టీలు, ఆదివారం జరగనున్న రెండో దశ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాయి. అసలు బ్యాలెట్ బాక్సులు తెరవకముందే, పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు పడకముందే గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు ఏకపక్షంగా మారిపోయాయి. ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా దక్కకుండా, పలు పంచాయతీలు ఏకగ్రీవమవ్వడం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మొదటి విడతలో వచ్చిన ఫలితాలు క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. తొలిదశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో దాదాపు 64 శాతానికి పైగా సర్పంచ్ పీఠాలను కూటమి మద్దతుదారులు కైవసం చేసుకోవడం రెండో దశపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ గాలి వీచడంతో, రెండో విడతలో ఎన్నికలు జరగాల్సిన 4,975 పంచాయతీల్లో ఏకంగా 1,171 స్థానాలు పోటీ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. తొలిదశతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య దాదాపు 65 శాతం మేర పెరగడం గమనార్హం. ఈ ఏకగ్రీవ పంచాయతీల్లో సింహభాగం కూటమి(NDA) ఖాతాలోనే పడటంతో, అసలు పోరు మొదలవకముందే సగం విజయం సాధించినట్లయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే కొన్ని చోట్ల ఏకగ్రీవాల పరంపర రికార్డు స్థాయిలో నమోదైంది. ముఖ్యంగా తిరుపతి, కడప(Kadapa), నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తిరుపతి జిల్లాలో 373 స్థానాలకు గానూ 136 చోట్ల, కడప జిల్లాలో 202 స్థానాలకు గానూ 116 చోట్ల ఎన్నికలు లేకుండానే సర్పంచులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపించింది. అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ 87 పంచాయతీలు ఉన్నప్పటికీ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకపోవడం విశేషం.
ఇక వార్డుల విషయానికొస్తే, మొత్తం 49 వేలకు పైగా వార్డుల్లో దాదాపు 19,561 వార్డులు ఏకగ్రీవంగా ముగిశాయి. మిగిలిన 29,667 వార్డులు, 3,804 సర్పంచ్ స్థానాల కోసం ఆదివారం అసలు సిసలైన పోరు జరగనుంది. ఈ స్థానాల కోసం 63 వేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తొలిదశలో కేవలం 28 శాతానికి పరిమితమైన వైసీపీ(YCP), రెండో దశలోనైనా పుంజుకుంటుందా లేదా కూటమి తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు స్వతంత్రులు, రెబెల్ అభ్యర్థులు చీల్చే ఓట్లు కూడా పలు చోట్ల గెలుపు ఓటములను శాసించే అవకాశం ఉంది.