ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు (83) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
1943లో జన్మించిన రాయపాటి సాంబశివరావు(Rayapati Sambasiva Rao), 1972లో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1982లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో తన సత్తా చాటారు. 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికై తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం 2014లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి, నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి మొత్తం ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, అటు వ్యాపార రంగంలోనూ ఇటు విద్యా దాతగానూ రాయపాటి చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా పొగాకు ఎగుమతుల వ్యాపారంలో ఆయన తనదైన ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా, గుంటూరులోని ప్రతిష్ఠాత్మక ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాయపాటి మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chadrababu Naidu), మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా, విద్యావేత్తగా ఆయన సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.