విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావడం పట్ల.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. యోగాను గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్నారు. యోగా కార్యక్రమం అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయనకు విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు.. అనంతరం.. మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కోసం ఎంత పట్టుదలతో పనిచేశారో వివరించారు. అదే సమయంలో యోగాంధ్ర ఖర్చుపై జగన్ చేసిన కామెంట్లకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రుషికొండపై భవనాలకు వేస్ట్ చేసిన డబ్బు కంటే ఇది తక్కువేనని చురకలంటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యోగాను ప్రపంచ వ్యాప్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ను స్ఫూర్తిగా తీసుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. “అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు దీనిలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఇంత విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు“ అని చంద్రబాబు అన్నారు. యోగాంధ్ర విజయం రాష్ట్రం మొత్తానికీ చెందుతుందని తెలిపారు.
యోగాంధ్రను నెల రోజులుగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టామని చెప్పారు. దీనిలో రికార్డు స్థాయిలో 3 లక్షల 30 వేల మంది పాల్గొన్నట్టు తెలిపారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించినట్టు చంద్రబాబు చెప్పారు.
నెల రోజులుగా చేపట్టిన యోగాంధ్ర కోసం 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అనుకుంటే.. ఇప్పుడు 1.80 కోట్ల మందికి సరిఫికెట్లు ఇవ్వాల్సి వస్తోందని చంద్రబాబు వివరించారు. యోగాను గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న సీఎం.. ఇది ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుందన్నారు.