జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి మరణించిన ఘటన సంచలనం రేపిస సంగతి తెలిసిందే. అయితే, ఆ కారు జగన్ ది కాదని, కాన్వాయ్ లోని ప్రైవేటు వాహనం అని వైసీపీ నేతలు బుకాయించారు. కానీ, తాజాగా అది జగన్ కారు అని తెలిసే సంచలన వీడియో బట్టబయలైంది. జగన్ కారు ముందు టైర్ల కింద పడే చనిపోయాడని తెలిపే వీడియో వైరల్ గా మారింది.
సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన కారని వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో పడ్డారు. దాంతోపాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియా నెటిజన్లు మండిపడుతున్నారు. కారు కింద సింగయ్య పడ్డాడని చెబుతున్నా కారు ఆపకుండా వెళ్లిపోయారని జగన్ కారు డ్రైవర్ పై మండిపడుతున్నారు.
సింగయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్త అని చూడకుండా రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయిన వైసీపీ కార్యకర్తల కర్కశత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా మరణించినా సరే వైసీపీ కార్యకర్త అయిన సింగయ్య మరణంపై జగన్ కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.