కడుపు నొప్పితో విలవిలలాడుతూ హాస్పిటల్ కి వెళ్లిన ఓ మహిళకు డాక్టర్లు డెలివరీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. డెలివరీ అయ్యేంతవరకు తాను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ మహిళకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు తెలియకపోవడం. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన ఎజౌ నగరంలో `లీ` అనే మహిళ కుటుంబంతో నివాసం ఉంటోంది. ఆమెకు పెళ్లై ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ నెల 16న లీ భోజనం తర్వాత తీవ్రమైన కడుపు నొప్పికి గురైంది. అతిగా తినడం వల్లే ఈ అసౌకర్యానికి కారణమని భావించిన లీ.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒంటరిగానే తన ఎలక్ట్రిక్ బైక్ పై సమీపంలోని హాస్పిటల్ కు వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తుండగా కడుపు నొప్పి మరింత తీవ్రమైంది.
ఈ క్రమంలోనే లీ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని గుర్తించి వైద్యులు షాకైపోయారు. ఇంతలోనే లీ శరీరం నుండి అమ్నియోటిక్ ద్రవం(ఉమ్ము నీరు) బయటకు పోయింది. దాంతో అప్రమత్తమైన డాక్టర్స్ హుటాహుటిన ప్రసూతి బృందాన్ని ఏర్పాటు చేసి లీ డెలివరీకి సహాయం అందించారు. మధ్యాహ్నం 3.22 గంటలకు, ఆమె సహజ ప్రసవం ద్వారా 2.5 కిలోల బరువున్న మగబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఇక లీ తన గర్భం గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్యర్యపోయింది. ఆమె మాట్లాడుతూ.. `నేను గర్భవతినని వైద్యులు చెప్పినప్పుడు, నమ్మలేకపోయాను. నాకు, నా భర్తకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. మరో బిడ్డ కోసం మేము ప్లాన్ చేయలేదు. గర్భనిరోధకత విషయంలో జాగ్రత్తగానే ఉన్నాము. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో వేవిళ్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి అలాంటి లక్షణాలేవీ కనిపించలేదు. పైగా చాలా రోజుల నుంచి ఇర్రెరెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్నాను. అందుకే రుతుస్రావం ఆగిపోయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నెలలుగా కొంచెం బరువు పెరిగాను. అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవు. అందుకే ప్రెగ్నెంట్ అన్న విషయం గ్రహించలేకపోయాను. అదృష్టవశాత్తూ, బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.` అంటూ చెప్పుకొచ్చింది.