గత కొన్నేళ్ల నుంచి ఓటీటీల క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ స్టార్స్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే విక్టరీ వెంకటేష్ `రానా నాయుడు` వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్‌స్టాపబుల్` షో తో ఓటీటీ లవర్స్ ను అలరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ బాట పట్టనున్నారని.. ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేశారని గతంలో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి.
అయితే తాజాగా ఓటీటీ ఎంట్రీ పై మనసులో మాట బయటపెట్టారు చిరు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కుబేర సక్సెస్ మీట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుబేర టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బెగ్గర్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయారని.. ఆయనకు తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని.. అలా రాకుంటే జాతీయ అవార్డుకు అర్ధమే లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు.
అలాగే నాగార్జున తనకు ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆలోచన విధానం, స్థితప్రజ్ఞత ఇలా అనేక విషయాల్లో స్ఫూర్తినిస్తూ ఉంటారని చిరు కొనియాడారు. ఈ క్రమంలోనే ఓటీటీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఫ్యూచర్‌లో అవసరమైతే ఓటీటీలో సినిమాలు చేయడానికి తాను రెడీ అన్నారు. ఇప్పటి నుంచి అందుకు మానసికంగా సిద్ధం అవుతున్నానని.. ఈ విషయంలో కూడా నాగార్జునే తనకు ప్రేరణ అన్నారు. అయితే ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో తన ముందుకు రావొద్దంటూ చిరు సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.