డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. 1985లో విడుదలైన `రగిలే గుండెలు` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి వెండితెరపై మెరిసాడు. 2003లో `విష్ణు` మూవీతో మంచు విష్ణు హీరోగా తన ఫిల్మ్ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత `సూర్యం`, `అస్త్రం`, `గేమ్`, `ఢీ`, `కృష్ణార్జున`, `సలీం`, `దేనికైనా రెడీ`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేశాడు. కానీ వీటిల్లో చెప్పుకోదగ్గ చిత్రం ఏదైనా ఉందా అంటే శ్రీను వైట్ల తెరకెక్కించిన ఒక్క ఢీ మాత్రమే. మిగతా సినిమాలేమీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అయినప్పటికీ మంచు విష్ణు వెండితెరపై ఎప్పటికప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం తన రాబోయే చిత్రం `కన్నప్ప` ప్రమోషన్స్ బిజీగా ఉన్నాడు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. ఒకవేళ తాను హీరో కాకపోతే ఏమి అయ్యేవాడ్నో వివరించాడు.
నిజానికి చిన్నతనంలోనే ఒక సినిమా చేసిన కూడా నటనా రంగంలోకే రావాలని, ఇక్కడే స్థిరపడాలని మంచు విష్ణు ఎప్పుడూ అనుకోలేదుట. మంచు విష్ణును ఐపీఎస్ చేయాలనేది మోహన్ బాబు డ్రీమ్ అట. `ఓ ప్రభుత్వ అధికారిగా చూడాలన్నది నాన్న కోరిక. అందుకే ఇంజనీరింగ్ లో చేరాను. కానీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు డాడీనే నా వద్దకు ఐపీఎస్ కంటే నీకు సినిమాలే బాగుంటాయన్నారు. ఆయన మాటలతో నా దృష్టి సినిమాలపై మళ్లింది. అప్పటి నుంచే నటుడిగా అవసరమైన ట్రాన్సపర్మేషన్ అంతా చేసుకున్నాను. హీరో కాకయుంటే నన్ను అందరూ ఐపీఎస్ గా చూసేవారేమో` అంటూ మంచు విష్ణు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.