ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తమిళనాడులో రాజకీయం అంతకంతకూ వేడుక్కుతోంది. ఈసారి ఎలా అయినా అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో అన్నాడీఎంకే.. బీజేపీలు పని చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళ ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించింది బీజేపీ అధినాయకత్వం. ఇందులో భాగంగా మురుగున్ వేడుకల్ని భారీగా నిర్వహించిన బీజేపీ అనుబంధ విభాగం.. ఆ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. సినీ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) అడుగు ముందుకు వేసి పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం విశేషం. దేవుడి పేరుతో రాజకీయాలు చేయటం సరికాదని.. తమిళులను మోసం చేసే ఆలోచనల్ని మానుకోవాలంటూ సత్యరాజ్ విరుచుకుపడ్డారు.
వీసీకే పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన సభలో సత్యరాజ్ మాట్లాడారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే కుదరదన్న సత్యారాజ్.. ‘పెరియార్ సిద్ధాంతాలను నమ్మే మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. మీరు పాల్గొన్న సభతో తమిళుల్ని మోసం చేశారు. మీరు పాల్గొన్న సభతో మమ్మల్ని మోసం చేశామని భావిస్తే అది తెలివితక్కువతనం. తమిళ ప్రజలు తెలివైన వారు. ఇక్కడ మీ ఆటలు సాగవు’ అంటూ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు.
మధురైలో జరిగిన మురుగున్ భక్తుల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. అధికార డీఎంకేపై మండిపడ్డారు. నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదని.. కానీ మన దేశంలో నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకొని టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటమేకాదు.. కొత్త రాజకీయ వేడిని పెంచేందుకు కారణమైందని చెప్పాలి.