ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గురించి పరిచయం అక్కరలేదు. ఐఐటీ రామయ్య అని పాపులర్ అయిన చుక్కా రామయ్య వేలాది మంది ఐఐటీ విద్యార్థులను తీర్చిదిద్దారు. చుక్కా రామయ్య చలవతో వేలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యారంగానికి చుక్కా రామయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పీవీ గౌరవ పురస్కారం వరించింది.
'పీవీ సప్తాహం' పేరుతో ఏడాదిపాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నల్లకుంటలోని ఆయన నివాసంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆయనకు అందజేశారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ...చుక్కా రామయ్య స్టూడెంట్ అన్న సంగతి చాలామందికి తెలీదు.
1963లో గోషామహల్ హైస్కూల్లో బండారు దత్తాత్రేయ చదువుతున్న సమయంలో అక్కడ చుక్కా రామయ్య ఫిజిక్స్ చెప్పేవారట. ఈ విషయాన్ని దత్తన్న స్వయంగా తాను రాసిన పుస్తకంలో వివరించారు. తమ మధ్య అనుబంధాన్ని, అనుభవాలను ఆయన నెమరు వేసుకున్నారు.