బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారం పెరగడంతోపాటు.. ఆయన పదవీ కాలం కూడా ఇప్పటికే పొడిగించిన నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఆయనను పక్కన పెట్టి.. తాజాగా నోటిఫికే షన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అందుకుని పార్టీని ముందుకు నడిపించేందుకు చాలా మంది ఆశావహులు ముందుకు వచ్చారు. వీరిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నా రు. ఈయనతోపాటు.. గతంలో బీజేపీ సారథ్యం చేసిన కె. లక్ష్మణ్ కూడా ఆశలు భారీగానే పెట్టుకున్నారు.
అయితే.. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఈయన నామినేషన్ వేయనున్నారు. రేపు యథావిధిగా ఎన్నికను నిర్వహించి.. రామచందర్‌రావు పేరును తెలంగా ణ బీజేపీ సారథిగా ప్రకటిస్తారు. ఇది పూర్తిగా ఇక లాంఛనే కానుంది. పైగా.. ముందుగానే పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఇతర నాయకులు ఆశలు పెట్టుకున్నా.. నామినేషన్ వేసే సాహసం చేసే పరిస్థితి లేదు. సో.. ఈ ప్రక్రియ జరిగిపోతుంది.
అయితే.. పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈ వ్యవహారం మండేలా చేసింది. పైగా ఎలాంటి సంస్థాగత ఎన్నిక లేకుండా.. ఏకపక్షంగా ప్రకటించడంతో ఆయన అగ్గిపై గుగ్గిలంలామండి పడ్డారు. ``పార్టీలో ఎవనికి పడితే వానికి .. పదవులు పంచుకుంటూ పోతే.. లాభమేంటి?`` అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు అంటే.. ఎవరో ఒకరి మోచేతి నీళ్లు తాగే వారు కాదని.. నిఖార్సుగా కార్యకర్తల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కానీ, తాజాగా ప్రకటన చూస్తే.. ఎవరో ఒకరి ప్రమేయంతో ఎంచుకున్నట్టుగా ఉందని రాజా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పార్టీ చీఫ్ అంటే..సంస్థాగతంగా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఓట్లు వేసి గెలిపించాలని.. అలా కాకుండా.. ఎవరో ఎవరినో ఎంపిక చేసేస్తే.. సరిపోతుందా? అనేది అధిష్టానం ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు.