ఏపీ రాజధాని అమరావతిని ఇప్పటికే హైటెక్ హంగులతో నిర్మిస్తున్నారు. నవ నగరాలుగా వర్గీకరించి.. రాజధానిని నిర్మిస్తు న్నారు. అయితే.. ఇప్పుడు ప్రపంచం దూకుడు మరింత వేగం పుంజుకున్నదరిమిలా.. సీఎం చంద్రబాబు తన కలల ప్రాజెక్టు అయిన.. అమరావతికి ఏఐ మెరుపులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే క్వాంటమ్ వ్యాలీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా విజయవాడలో `అమరావతి క్యాంటం వ్యాలీ`పై నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబులో ఇప్పటి వరకు చూడని ఓ `హైరేంజ్ థింకింగ్` పర్సనాలిటీ కనిపించింది.
ప్రధానంగా అమరావతిలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్న క్వాంటమ్ వ్యాలీ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా డిస్కస్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఒక విజన్ లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు. భవిష్యత్ టెక్నాలజీని పాలనకు, అభివృద్ధికి ఎలా సమ్మిళితం చేయాలన్నదే సర్కారు లక్ష్యంగా చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ ప్రోటోటైప్‌ను ఐబీఎం నేషనల్ వర్క్ షాప్‌లో ప్రదర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి వందశాతం పౌరసేవలు వాట్సప్ ద్వారానే అందించనున్నారు. అదేసమయంలో `డేటా లేక్`పై ప్రభుత్వంపనిచేయాలని భావిస్తోంది. జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ పైల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నారు. సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం. వ్యవసాయ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనుసంధానించడం ద్వారా అద్భుతాలు చేయొచ్చుననేది సీఎం చంద్రబాబు ఆలోచన.
ఇది రాజధాని స్థితిగతులను సంపూర్ణంగా మార్చేస్తుందని కూడా ఆయన భావిస్తున్నారు. అందుకే.. ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు హైరేంజ్ థింకింగ్.. `అమరావతి`కి క్వాంటం మెరుపులు తీసుకువస్తుందని నిపుణులు పేర్కొనడం గమనార్హం. తద్వారా.. ఐఐటీ, ఐఐఐటీలలో విద్యను పూర్తి చేసుకున్నవారికి.. ఏపీ గమ్యస్థానంగా మారే అవకాశం ఉంటుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. 2026, జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి.