టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి, హిట్లు కొట్టి వారి అభిమానుల మనసులు గెలిచిన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఆయన ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చారు. అలాంటి నిర్మాతతో చరణ్ మళ్లీ జట్టు కడుతుంటే ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అందులోనూ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా అనేసరికి వారి ఉత్సాహం మామూలుగా లేదు.
కానీ ఈ కలయికలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సమయానికి మొత్తం మారిపోయింది. విపరీతంగా ఆలస్యం అయి, ఎట్టకేలకు ఈ సంక్రాంతికి రిలీజైన ‘గేమ్ చేంజర్’ నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా తేలింది. ఇది అందరికీ నిరాశ కలిగించిన విషయమే.
ఈ సినిమా నుంచి భారీగా డబ్బులు పోగొట్టుకున్న దిల్ రాజు.. తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుంటే అభిమానులు అర్థం చేసుకున్నారు.
కానీ ఒకట్రెండుసార్లు అయితే ఓకే కానీ.. దిల్ రాజు అనేక పర్యాయాలు ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ గురించి మాట్లాడడం చరణ్ అభిమానుల్లో అసహనాన్ని పెంచింది. అది చాలదన్నట్లు తాజాగా రాజు సోదరుడు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చరణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’ రిలీజ్ తర్వాత హీరో కానీ, దర్శకుడు కానీ.. కర్టసీ కాల్ కూడా చేయలేదని.. తమను పట్టించుకోలేదని ఆయన అసహనంగా మాట్లాడారు. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారా అంటే లేదు అని కూడా అన్నారు.
ఈ వ్యాఖ్యలను మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్ తర్వాత తనతో సినిమా చేసే అవకాశాన్ని చరణ్ ఇస్తే దిల్ రాజే సరిగా ఉపయోగించుకోలేకపోయాడని.. ‘ఇండియన్-2’ చేయడం కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను వాడుకోవడానికి ఫామ్‌లో లేని శంకర్‌తో సినిమాను కమిట్ చేయించడం.. మూడేళ్లకు పైగా చరణ్ విలువైన సమయాన్ని ఈ సినిమా కోసం వృథా చేయించడం.. ప్రొడక్షన్ మీద పూర్తిగా పట్టు కోల్పోవడం.. సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం.. ఇలా తమ వైపు నుంచి ఎన్నో లోపాలు పెట్టుకుని.. చరణ్ మీద విమర్శలు చేయడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
‘గేమ్ చేంజర్’ కోసం పెట్టిన సమయంలో చరణ్ రెండు మూడు సినిమాలు చేసి ఉంటాడని.. బలవంతంగా శంకర్‌తో ముడిపెట్టించి విలువైన సమయాన్ని వృథా చేయించారని.. చరణ్ ఖాతాలో డిజాస్టర్ జమ చేశారని.. పైగా తిరిగి చరణ్ మీదే దాడి చేయిస్తున్నారని రాజు మీద అభిమానులు మండిపడుతున్నారు. ఓవైపు దిల్ రాజు మళ్లీ చరణ్‌తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అంటుంటే.. మరో వైపు ఆయన సోదరుడు హీరో మీద విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజు మీద సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించిన అభిమానులు.. ఇకపై ఆయనతో సినిమా చేయొద్దంటూ చరణ్‌కు విన్నపాలు చేస్తున్నారు.