వైసీపీసీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి తమను ఘరానా మోసం చేశారంటూ.. ఓ కుటుంబం మంత్రి నారా లోకేష్‌ను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని కోరింది. తాజాగా మంగళవారం మంత్రి నారా లోకేష్.. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బారు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వాటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలని సిబ్బందిన ఆదేశించారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తమను మోసం చేశారంటూ.. ఓ కుటుంబం ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.
ఏంటి ఫిర్యాదు..
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు.. తమ కుమారుడు వైద్య విద్య చదువుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పోస్టు గ్రాడ్యయేషన్ సీటు కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమయంలో ఒక రోజు తమకు ఫోన్ వచ్చిందని.. దీనిలో సజ్జల రామకృస్నారెడ్డి సన్నిహితులమంటూ.. ఇద్దరు పరిచయం చేసుకున్నారని.. కోటి రూపాయలు ఇస్తే.. పీజీ మెడికల్ సీటు ఇస్తామన్నారని తెలిపారు. దీనికి అన్నీ సజ్జలే చూసుకుంటారని చెప్పినట్టు వివరించారు.
దీంతో తాము నిజమేనని నమ్మి.. పొలం అమ్ముకుని రూ.కోటిని వారికి ముట్టజెప్పామన్నారు.కానీ, నెలలు గడిచినా.. తమకు న్యాయం జరగలేదని వివరించారు. దీంతో ఇచ్చిన సొమ్మును వెనక్కి తిరిగి ఇవ్వాలని తాము కోరగా.. బెదిరింపులకు గురి చేస్తున్నారని.. చంపేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్‌ను అభ్యర్థించారు. సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితులు మోసం చేశారని సుబ్బారావు వివరించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రి నారాలోకేష్.. విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు.