ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘రామాయణం’ను చెప్పొచ్చు. నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026, 2027 సంవత్సరాల్లో రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన షో రీల్ వావ్ అనిపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర విశేషాల గురించి రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఐతే నెటిజన్లు అంతటితో ఆగిపోవట్లేదు. ఎవ్వరూ ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మీమ్స్‌తో, జోక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆ చర్చ సాయిపల్లవి, కాజల్ అగర్వాల్‌ల గురించి కావడం విశేషం.
‘రామాయణం’లో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుంటే.. సీతగా సాయిపల్లవి కనిపించనున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు యశ్ రావణుడి పాత్ర పోషించనున్నాడు. ఐతే పెద్దగా ప్రచారం జరగని విషయం ఏంటంటే.. ఇందులో రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించనుంది. మొన్నటి షో రీల్ వీడియోను షేర్ చేయడం ద్వారా.. తాను ఈ చిత్రంలో భాగమైన విషయాన్ని కాజల్ కూడా ధ్రువీకరించింది. ఐతే సాయిపల్లవి గొప్ప పెర్ఫామరే అయినప్పటికీ.. అందం కోణంలో చూస్తే కాజల్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా కాజల్ పేరు తెచ్చుకుంది. ఈ విషయంలో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులున్నారు.
సాయిపల్లవిని అందం కోణంలో అభిమానించే వాళ్లు తక్కువ. ఐతే కథ పరంగా సీత అందానికి ముగ్ధుడై, ఆమె మీద మోజుపడి రావణుడు ఆమెను ఎత్తుకు రావాలి. కానీ ఇంట్లో కాజల్ లాంటి అందగత్తె ఉండగా.. సాయిపల్లవి కోసం మోజు పడి కిడ్నాప్ చేయడమేంటి అంటూ.. నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. కాస్టింగ్ పరంగా ఇది పెద్ద తప్పు అని అభిప్రాయపడుతున్నారు. గతంలో పాకిస్థాన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇతర కారణాలతో సాయిపల్లవి సీత పాత్రను చేయడం మీద ముందు నుంచి ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఈ కోణాన్ని బయటికి తీసి.. సీత పాత్రకు ఆమెను ఎంచుకోవడాన్ని తప్పుబడుతుండడం విశేషం.