ఏపీలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక కేసులు, అరెస్టులు భయంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు జగన్ కు టాటా చెప్పి పార్టీ మారిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. రేషన్ బియ్యం స్కామ్‌లో తాను సేఫ్ అని అనుకున్నారో ఏమో.. కొద్ది రోజుల నుంచి పదే పదే మీడియా ముందుకు వస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు గుప్పిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనదైన స్టైల్ లో ఇచ్చిపడేశారు.
ప్రకాశం జిల్లాలో జల జీవన్ మిషన్ పనుల ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ కళ్యాణ్.. వైసీపీ పై విమర్శల దాడి చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తాజాగా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. మీడియా ముందు ఆయన మాట్లాడుతూ.. `నువ్వెవరు..? జగన్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వను అనడానికి నువ్వు ఎవరివి? 2019లో ఇదే మాదిరిగా పవన్ ఛాలెంజ్ చేశారు. జగన్ రాడు.. రానివ్వను.. ఇది నా శాసనం అంటూ సినిమా డైలాగులు కొట్టారు.
కానీ ఏమైంది వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. నువ్వైనా నేనైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. అంతిమంగా రాష్ట్ర ప్రజలే న్యాయ నిర్ణేతలు. జగన్ ను తేవాలన్న, ఆపాలన్న.. చంద్రబాబును తొక్కాలన్న, మళ్లీ సీఎం సీటులో కూర్చోబెట్టాలన్న అది కేవలం ప్రజల చేతుల్లో మాత్రమే ఉంది. ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది` అంటూ పేర్ని నాని పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.