రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన మంత్రుల పనితీరు ఆశించిన మేర ఉండకపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి వైసీపీలో ఎవరు మాట్లాడాలి.. ఏం మాట్లాడాలి అనేది స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. కానీ టీడీపీలో రాజకీయ నాయకులకు స్వాతంత్రం ఉంది. అయినా కూడా చాలా మంది సైలెంట్‌గానే ఉంటున్నారు. ముఖ్యంగా మంత్రుల్లో కొద్దిమంది మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మిగతా వారు తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విధుల నిర్వహణలో ఎలా ఉన్నా.. విపక్ష వైసీపీ రాజకీయంగా చేసే ఆరోపణలు తిప్పుకొట్టడంలో మంత్రులు వెనక పడ్డారు. ఈ విషయంపై తాజాగా క్యాబినెట్ భేటీలో బాబు రియాక్ట్ అవుతూ మంత్రులకు నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలపై ఎందుకు స్పందించడం లేదని మంత్రులను బాబు ప్రశ్నించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గురించి అసభ్యకరంగా మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడానికి ఎందుకు ఆలస్యం చేశారని ఫైర్ అయ్యారు. తోతాపురి మామిడికి కిలోకు రూ.4 అదనంగా ఇచ్చి కొనుగోలు చేయించాం. 80 శాతం కొనేశాక జగన్ హడావుడి చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటే అడ్డుకోలేకపోయారని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జరుగుతున్న పరిణామాల పట్ల మంత్రులు ఫుల్ యాక్టివ్ గా ఉండాలని.. విపక్షాలు చేస్తున్న కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టాలని.. తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై వెంటనే స్పందిస్తూ కౌంటర్లు ఇవ్వాలని.. లేదంటూ రాజకీయంగా చాలా నష్టపోతామని చంద్రబాబు సూచించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను మంత్రులే మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రజాక్షేత్రంలో వాస్తవాలను బలంగా వినిపించాలన్నారు. ఇకనైనా మారతారో.. లేక పదవుల నుంచి తప్పుకుంటారో మీ ఇష్టమని బాబు హెచ్చరించారు. రాజకీయంగా కౌంటర్లు ఇవ్వకపోతే.. మీ స్థానంలో వేరే వారు వస్తారని మంత్రులకు చంద్రబాబు తెగేసి చెప్పారు.