కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టార్గెట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అవినీతి అంశంలో ప్రశాంతి రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగారు. మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రసన్న చేసిన వ్యాఖ్యలు నెల్లూరు పాలిటిక్స్ ను హీటెక్కించాయి.
ప్రసన్నను టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏకిపారేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరి.. ఇలా ప్రతి ఒక్కరూ ప్రసన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రశాంతి రెడ్డికి ప్రసన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అదే విధంగా వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రసన్నకుమార్‌రెడ్డిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ప్రశాంతి రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు. మహిళలు ఏం తప్పు చేశారని మీ పార్టీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు? మహిళలకు ఇంత అన్యాయం ఎందుకు? అవినీతి గురించి ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేక అవహేళన చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ల గురించి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఇలాంటి నాయకులను మీరెలా ఎంకరేజ్ చేస్తున్నారు? కనీసం ఫోన్ చేసి ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండని మీరు ఎందుకు అడగలేకపోయారు? అని ఎమ్మెల్మే ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెప్తారా? లేదా? అన్నది చూడాలి.