మలయాళ సినిమాలను ఫాలో అయ్యేవాళ్లకు సౌబిన్ షాహిర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుట్టప్పన్, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్ లాంటి చిత్రాలతో అతను నటుడిగా గొప్ప పేరే సంపాదించాడు. ఓవైపు లీడ్ రోల్స్‌లో అదరగొడుతూ, ఇంకోవైపు క్యారెక్టర్-విలన్ పాత్రలతోనూ మెప్పిస్తూ ఈ తరం మేటి నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సౌబిన్. అతను కేవలం నటుడే కాదు.. నిర్మాత కూడా. మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో గత ఏఢాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో అతను ప్రధాన పాత్ర పోషించడమే కాదు.. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు కూడా. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్లో రూపొందించిన ఈ చిత్రం రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళ ఆల్ టైం కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసింది. ఈ చిత్రంతో భారీ లాభాలనే ఆర్జించాడు సౌబిన్. ఐతే ఈ సినిమా లాభాల్లో వాటా విషయమై ఇప్పుడు పెద్ద వివాదం చోటు చేసుకుని.. సౌబిన్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.
‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాణం కోసం సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్ తమ వద్ద రూ.7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, లాభాల్లో 40 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ సినిమా రిలీజయ్యాక చెప్పిన మాట ప్రకారం వాటా ఇవ్వడం లేదని సిరాజ్ హమీద్ అనే ఫైనాన్షియర్ చీటింగ్ కేసు పెట్టాడు. వ్యవహారం కోర్టుకు చేరింది. ఏడాదిగా విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సౌబిన్ అరెస్ట్ అయ్యాడు.
సిరాజ్ హమీద్ చెబుతున్న దాని ప్రకారం సౌబిన్ కుటుంబం లాభాల్లో వాటా కింద రూ.47 కోెట్లు చెల్లించాల్సి ఉందట. ఈ కేసుకు సంబంధించి తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలని సౌబిర్, అతడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. అనంతరం పోలీసులు సౌబిన్‌ను అరెస్ట్ చేశారు.
ఐతే వెంటనే బెయిల్ రావడంతో సౌబిన్, అతడి తండ్రి బయటికి వచ్చేశారు. కేసులో పరిణామాల్ని బట్టి చూస్తే సౌబిన్.. సదరు ఫైనాన్షియర్‌కు హామీ ప్రకారం లాభాల్లో 40 శాతం వాటా ఇవ్వక తప్పేలా లేదు. సౌబిన్ కీలక పాత్ర పోషించిన ‘కూలీ’ వచ్చే నెల 14న రిలీజ్ కానుండగా.. మలయాళంలో అతను అరడజను సినిమాల దాకా చేస్తున్నాడు.