పుష్ప-2’ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేశాక.. తమిళ దర్శకుడు అట్లీతో జట్టు కట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అట్లీ ఇప్పటిదాకా మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు కానీ.. బన్నీతో సినిమా అనేసరికి తన విజన్ మారిపోయింది. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టు ఏదో చేయబోతున్నాడని ప్రి విజువలైజేషన్ టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. ఆ వీడియోతో సినిమా మీద అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఈ సినిమా బడ్జెట్, టెక్నీషియన్లు, తారాగణం గురించి వస్తున్న వార్తలు బన్నీ అభిమానుల్లో ఎంతో ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కథానాయికగా దీపికా పదుకొనే ఖరారైంది. ఆమెతో పాటు మృణాల్ కపూర్ సైతం మరో కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లుంటారని.. మరో కథానాయికగా జాన్వి కపూర్ కపూర్‌ను అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ మూడో పాత్ర కోసం రష్మిక మందన్నా పేరును పరిశీలిస్తున్నారని.. పుష్ప తర్వాత మరోసారి బన్నీ-రష్మిక జంటను చూడబోతున్నామని కొత్త రూమర్ వినిపిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. ఇందులో విలన్ పాత్ర గురించి లేెటెస్ట్‌గా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరో ఎత్తు. ఇందులో విలన్ పాత్ర చాలా స్పెషల్ అని.. దాని కోసం హాలీవుడ్ లెజెండరీ నటుడు విల్ స్మిత్‌ను సంప్రదిస్తున్నారని ఒక క్రేజీ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. హాలీవుడ్ నటుడిని ఎంచుకుంటే సినిమా పాన్ వరల్డ్ రేంజికి వెళ్లిపోతుందని టీం భావిస్తోందట. ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ వీఎఫెక్స్ సంస్థలు పని చేస్తుండడం విశేషం. బడ్జెట్ కూడా ఏకంగా రూ.800 కోట్లు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రేంజ్ చూసి ఎవరో హలీవుడ్ నటులు టెంప్ట్ అవడానికి అవకాశముంది కానీ.. మరీ విల్ స్మిత్ అంటేనే కొంచెం అతిగా అనిపిస్తోంది. మరి ఈ రూమర్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.