ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలలో చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ఆయన పుణ్యమే. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాడిన చుక్కా రామయ్య..ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలోనే 99వ జన్మదినం జరుపుకున్న చుక్కా రామయ్యను పలువురు ప్రముఖులు కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా చుక్కా రామయ్య ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయకుమార్ తదితరులు వెళ్లారు. ఆయనను పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్యంతో చుక్కా రామయ్య ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులుగా మంచానికే, వీల్ చైర్ కే ఆయన పరిమితమయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించి పూలమాల, శాలువాతో సత్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు. విద్యారంగానికి రామయ్య అందించిన సేవలను వారంతా కొనియాడారు. తనను పరామర్శించడానికి ఆచార్య హరగోపాల్, వనమాల దంపతులను రావడంతో రామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వాట్సాప్ వీడియోకాల్ ద్వారా చుక్కా రామయ్యకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. మాట్లాడలేని స్థితిలోనూ వారందరినీ చూసి సైగల ద్వారా రామయ్య హర్షం వ్యక్తం చేశారు.