ఇండియన్ క్రికెట్ టీంలో ఒక తెలుగు వాడు ఉంటేనే మన వాళ్లు చాలా ఎగ్జైట్ అవుతారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు టెస్ట్ టీంలో ఆడుతున్నారు. వారిలోె ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. మరొకరు హైదరాబాద్ వాసి మహ్మద్ సిరాజ్. నితీశ్ అచ్చ తెలుగు కుర్రాడు కాగా.. సిరాజ్‌కు కూడా తెలుగు తెలిసే ఉంటుంది. నితీశ్ ‘తెలుగు’ ప్రభావం జట్టు మీద బాగానే ఉందని ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా దేశం మొత్తానికి అర్థమైంది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తెలుగులో మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది. మూడో టెస్టు తొలి రోజు నితీశ్ కుమార్ రెడ్డి గొప్పగా బౌలింగ్ చేశాడు. తొలి వికెట్ కోసం జట్టు ఎదురు చూస్తున్న సమయంలో.. ఒకే ఓవర్లో ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లను ఔట్ చేసి జట్టుకు గొప్ప ఉపశమనాన్ని అందించాడు. కాగా నితీశ్ ఒక చక్కటి బంతిని సంధించిన సమయంలో.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ ‘‘బాల్ రా మామా’.. ‘‘బాగుంది రా మామా’’ అనడం స్టంప్ కెమెరాల్లో రికార్డయింది. అవి స్పష్టంగా వినిపించాయి.
తెలుగు కామెంటేటర్లు ఈ విషయాన్ని గుర్తించి కెప్టెన్ నోట తెలుగు మాట.. మన నితీశ్ కుమార్ రెడ్డి టీంలో అందరికీ తెలుగు నేర్పించేస్తున్నాడంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నితీశ్ భారత జట్టులోకి వచ్చి ఏడాదే అయింది. ఈలోపే శుభ్‌మన్ ఇలా తెలుగు మాటలు నేర్చేసుకుని మ్యాచ్‌లో వాడేస్తుండడం ఆశ్చర్యమే. గతంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లతో సౌత్‌కు చెందిన ప్లేయర్లు తెలుగులోనే మాట్లాడేవారు. మాజీ కెప్టెన్ రోహిత్‌కు సైతం తెలుగు వచ్చు. అతడి తల్లి వైజాగ్ వాసి అన్న సంగతి తెలిసిందే.