వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా తమ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈమధ్య పుష్ప సినిమాలోని `రప్పా రప్పా నరికేస్తాం` డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ శ్రేణులు ఈ డైలాగ్ ను తెగ వాడేస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా పెడుతున్నారు. అయితే ఈ అంశంపై నేడు కృష్ణ జిల్లా పామర్రులో జరిగిన సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
`అరేయ్ రప్పా రప్పా నరికేస్తాం ఏంట్రా.. ఎన్నిసార్లు అంటారు.. అదే పనా? చికట్లో కన్ను కొడుతే మొత్తం అయిపోవాలి. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు అసహ్యంగా ఏంటి ఇది? కరిచే కుక్క మొరగదు.. మొరిగే కుక్క కరవదు. అదే తెలుసుకోండి. రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని కరిచేయ్. దాన్ని ఎవరికైనా చెప్పాలా? చెప్పికాదు, చెప్పకుండా నరికేయాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనట్టుగా పరామర్శించాలి` అంటూ పేర్ని నాని తమ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. ఒకప్పుడు ప్రజానేత, మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది.. అలాంటి పేర్ని నాని హత్యా రాజకీయాలను ప్రత్సహిస్తూ వ్యాఖ్యనించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి పార్టీ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా పేర్ని నాని వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ప్రజల మన్ననలు పొందేలా పార్టీ శ్రేణులను ప్రోత్సహించాల్సింది పోయి.. చెప్పికాదు, చెప్పకుండా నరికేయంటూ సూచించడం ఎంత వరకు సబబు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.