సాధారణ కేసుల్లో రాజకీయ నాయకులు చిక్కుకుంటే.. ఒకప్పుడు అంటే.. ఓ రెండు మూడు దశాబ్దాల కిం దట.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు. కానీ.. తర్వాత కాలంలో ఎంతో సీరియస్ కేసులు అయితే.. తప్ప పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఆ తర్వాత.. కాలంలో కులం, సామాజిక బలం వంటివాటిని చూసి నింపాదిగా చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇక, వైసీపీ హయాంలో అయితే.. ఇవన్నీ చెరిగిపోయాయి. అవతలి వ్యక్తి ఎంత నేరం, ఘోరానికి పాల్పడినా.. వెనుకేసుకురావడం.. ప్రతిపక్ష కుట్ర అంటూ.. ఎదురు దాడి చేయడం వైసీపీకి కామన్ అయింది. ఇలానే.. హిందూపురం అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే. బహిరంగంగా రెడ్ హ్యాండ్‌గా ఆయన పట్టుబడినా.. చర్యలు తీసుకోకపోగా.. వెనుకేసుకు వచ్చారు. ఆ తర్వాత.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనంతబాబు తన సొంత కారుడ్రైవర్(మాజీ)ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
దీనిపైనాఅప్పట్లో వైసీపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ప్రస్తుతం అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ గానే ఉన్నారు. ఈ కేసు కూడా ముందుకు సాగడం లేదు. కాగా.. వైసీపీ తరచుగా విమర్శించే జనసేన మాత్రం..తన పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. వెంటనే పార్టీ నుంచి పక్కన పెట్టేస్తోంది. ముందు పక్కన ఉండడం.. కేసు తేలాక.. పార్టీ తరఫున ప్రజలకు సేవ చేద్దురు కానీలే.. అని నిర్మొహమాటంగా తేల్చి చెబుతోంది. గతంలో జానీ మాస్టర్ గురించి తెలిసిందే. ఇక, తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న జనసేన నాయకురాలు కోట వినుత వ్యవహారం లోనూ జనసేన ఇలానే వ్యవహరించింది.
ఆమె కూడా.. కారు డ్రైవర్ హత్య కేసులో నిందితురాలిగా మారారు. ఈ విషయాన్ని చెన్నై పోలీసులు నిర్దారించారు. సొంత కారు డ్రైవర్ రాముడు హత్యకు గురయ్యారు. అయితే.. దీనివెనుక వినుత ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెను అరెస్టు కూడా చేశారు. అంతే.. వెంటనే జనసేన అధినేత.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ..ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదీ.. వైసీపీకి, జనసేనకు తేడా అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.