ఇప్పటివరకు వచ్చిన అంచనాలు.. ప్రమాదానికి కారణాలపై ఊహాగానాల గురించి తెలిసిందే. అయితే.. తాజాడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో తన ప్రాథమిక రిపోర్టును విడుదల చేసింది. ఇందులో విమాన ప్రమాదానికి కారణం ఏమిటి? పైలట్లు మాట్లాడుకున్న ఆఖరి మాటలు ఏమిటన్న విషయాల్ని రివీల్ చేసింది.
పదిహేను పేజీలున్న ఈ ప్రాథమిక రిపోర్టులో కీలక విషయాల్ని వెల్లడించారు. జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలటం.. విమానంలో ప్రయాణిస్తున్న 240 మంది ప్రయాణికులతో పాటు మరో 30 మందికి పైనే మరణించటం తెలిసిందే. లండన్ కు వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదం షాక్ నేటికీ.. పలువురు పైలెట్లను వెంటాడుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా విడుదలైన రిపోర్టులో విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్ లు ఆగిపోయినట్లుగా వెల్లడించింది.
ఇదే విషయాన్ని పైలెట్ మరో పైలెట్ మాట్లాడుకున్న విషయాన్ని రిపోర్టులో వెల్లడైంది. ఇంధన కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆగిపోయిందని ఒక పైలెట్ మరో పైలెట్ ను అడగ్గా.. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సదరు పైలట్ బదులిచ్చారు. కాక్ పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలుగా ఏఏఐబీ వెల్లడించింది. అనంతరం మేడే కాల్ వచ్చిందని నివేదిక పేర్కొంది. ఆ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఈ లోపే విమానం కూలిపోయిన విషయాన్ని నివేదిక వెల్లడించింది. విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు.. వీడియోల పరిశీలన పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసి.. తదుపరి పరీక్షల కోసం వాటిని భద్రపరిచారు. ప్రమాదానికి ముందు ఇంధనం.. దాని బరువు పరిమితుల్లోనే ఉన్నట్లుగా రిపోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు తేలాల్సిన అంశం ఏమంటే.. ఇంధన కంట్రోల్ స్విచ్ లను ఆపిందెవరు? సెకను పాటు ఆగిన ఈ స్విచ్ కారణంగానే ప్రమాదం జరిగిన విషయం స్పష్టమైన నేపథ్యంలో.. అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందన్నది ఇప్పుడు చర్చగా మారింది.