కంగనా రనౌత్. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. సొంత పార్టీ అయినా.. పరాయి పార్టీ అయినా.. నిప్పును కడిగినట్టు కడిగేయడం ఆమె నైజం. ఇక, బాలీవుడ్ హీరోయిన్‌గా తెరపై కోట్ల మందిని అలరించి ఫిలింఫేర్ అవార్డు సహా... పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్న నటీమణి. చాలా చిన్న వయసులోనే ఆమె రాజకీయ బాటపట్టారు. తొలుత కొన్ని రోజులు కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ, రాహుల్‌పై నేరుగా విమర్శలు చేసి.. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ ఆమెను స్వాగతించింది.
2024 పార్లమెంటు ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో కీలకమైన మండి నుంచి రనౌత్ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ ఎన్ని ఆటం బాంబులు పేల్చా రో తెలిసిందే. నిత్యం ఆమె వార్త లేకుండా.. జాతీయ మీడియా పత్రికలు రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత ఇష్టంగా.. నిర్మొహమాటంగా రాజకీయాలు చేస్తున్న రనౌత్‌కు అసలు రాజకీయాలు ఇప్పుడు తెలిసొ చ్చాయట!. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పుకొచ్చారు.
``ఎంపీగా నాకు వచ్చే జీతానికి.. రాజకీయం పెడుతున్న ఖర్చులకు పొంతన లేకపోతోంది. జేబులు ఖాళీ అవుతున్నాయి. రాజకీయం అంటే.. ఇంత ఖర్చు ఉంటుందా? ఇంతమందిని పోషించాలా(కార్యకర్తలు)?`` అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. లెక్కలు కూడా చెప్పుకొచ్చారు. పీఏలు ఇద్దరికీ నెలకు 50 వేల చొప్పున జీతం, కార్యాలయాలకు అద్దెలు.. కారు డ్రైవర్ జీతాలు, క్షేత్రస్థాయి పర్యటనలకు ఎంత లేదన్నా.. పర్యటనకు రెండు లక్షల చొప్పున చేతులు కాల్చుకోవాల్సి వస్తోందన్నారు.
అందుకే.. నిఖార్సయిన రాజకీయాలు చేయలేకపోతున్నారని.. అసలు వాస్తవాన్ని చెబుతున్నానని రనౌత్ వ్యాఖ్యానించారు. తనకు ఎంపీగా ఇస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. అందుకే.. రాజకీ యాల్లో నాయకులు సైడ్ ఇన్‌కమ్ చూసుకుంటున్నారని కూడా చెప్పారు. కానీ, తనకు అలవాటు కాలేదని పేర్కొన్నారు. అయితే.. రనౌత్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ``అసలు రాజకీయం వంటబట్టినట్టుందే..`` అని ఒకరు అంటే.. ``రాజకీయం అంటే.. `నటించడం` అనుకుంటివా!`` అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.