తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోట మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆఖరి చూపు కోసం కోట ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. కోట శ్రీనివాసరావు స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ డాక్టర్. 1945 జూలై 10 కోట శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి మాదిరిగానే తాను కూడా డాక్టర్ అవ్వాలని కోట కల కన్నారు. కానీ ఆ కల తీరలేదు.
కంకిపాడులో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన విజయవాడలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. పలు బ్రాంచ్ లలో పని చేశారు. బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సాయంత్రం వేళ నాటకాలు వేయడం ప్రారంభించారు. నాటక సమాజంతో పాటు రేడియో నాటకాలు కూడా వేశారు. అలా ఓసారి `ప్రాణం ఖరీదు` నాటకం వేయగా.. దాన్ని చూసి సినిమాగా తీయాలని దర్శకనిర్మాత క్రాంతి కుమార్ భావించారు. అలా 1978లో విడుదలైన `ప్రాణం ఖరీదు` మూవీలో చిన్న వేషం వేసి కోటా శ్రీనివాసరావు తొలిసారి వెండితెరపై అడుగు పెట్టారు. ఇదే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా నటుడుగా తన కెరీర్ ను ప్రారంభించారు.
అయితే ప్రాణం ఖరీదు అనంతరం ఐదేళ్లపాటు కోట వెండితెరపై కనిపించలేదు. బ్యాంకు ఉద్యోగం కొనసాగించారు. మళ్ళీ 1983లో ఒక సినిమా చేశారు. బ్యాంకు సెలవులు పెట్టుకుని కొన్ని సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో అవకాశాలు పెరగడంతో ఉద్యోగం మానేసిన కోట.. పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడ్డారు. 1987లో రిలీజ్ అయిన `ఆహా నా పెళ్లంట` మూవీతో ఆయనకు బ్రేక్ వచ్చింది. నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 750 కు పైగా చిత్రాల్లో కోట నటించారు. విలన్ గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలను పోషించారు. విలన్‌గా హాస్యాన్ని మిళితం చేసిన మొట్టమొదటి నటుడు కోటానే. ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిన కోట.. తన సుధీర్గ సినీ ప్రయాణంలో 9 నందిలతో పాటు ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నారు.